హైదరాబాద్ : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన రోశయ్య గుండెపోటుతో మరణించారు. ఉదయాన్నే ఆయనకు గుండెపోటు రాగా బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మధ్యలోనే చనిపోయారు. ప్రస్తుతం ఆయన బౌతికకాయం స్టార్ హాస్పిటల్లోనే ఉంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల గవర్నరుగా పనిచేశారు. మంచి వక్తగా పేరుతెచ్చుకున్నాడు. ఆర్థిక సంబంధ విషయాలు, రాజకీయాలపై మంచి పట్టు ఉంది.
కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో కామర్స్ చదువుకున్నారు. కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు.
తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేశారు. తరువాత అనేకమంది ముఖ్యమంత్రుల మంత్రివర్గాలలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారు రోశయ్య.
2004-09 కాలంలో 12వ శాసనసభకు చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నికైననూ, 2009 ఎన్నికల ముందు ప్రత్యక్ష ఎన్నికలలో పోటీచేయకుండా శాసనమండలి సభ్యుడిగా ఎన్నికయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3వ తేదీ నుంచి 2010 నవంబరు 24వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నర్గా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్ర శేఖర్ రావు మరిము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ధిక శాఖ మంత్రిగా పలు పదవులకు వన్నె తెచ్చిన రోశయ్య, సౌమ్యుడిగా, సహన శీలిగా, రాజకీయాల్లో తనదైన శైలిని ప్రదర్శించేవారు అని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసిఆర్, వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు