హైదరాబాద్ : మాజీ మంత్రి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత మహ్మద్ ఫరీదుద్దీన్ బుధవారం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మృతికి సీఎం కేసీఆర్ తో పాటు పలువురు తెలంగాణ మంత్రులు సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా ఫరీదుద్దీన్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మాజీ మంత్రి మృతి వార్తను తెలుసుకున్న మంత్రి హరీష్ రావు హైదరాబాద్ లోని ఆస్పత్రికి వెళ్లారు.
మృతికి గల కారణాలను డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఫరీదుద్దీన్ భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. ఫరీదుద్దీన్ మృతి పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రగాఢ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మైనార్టీల సంక్షేమానికి మాజీ మంత్రి ఫరీదుద్దీన్ ఎంతో కృషి చేశారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ అన్నారు. ఆయన మృతిపట్ల సంతాపం ప్రకటించారు.
ఎమ్మెల్యేగా, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రిగా, ఎమ్మెల్సీగా ఫరీదుద్దీన్ ఎంతో కృషి చేశారని హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు లు కొనియాడారు. మెదక్ జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయనతో కలిసి పని చేసిన అనుభవం ఉందని మంత్రి హరీష్ రావు చెప్పారు. మంత్రిగా ఉమ్మడి ఆంధ్రపదేశ్ రాష్ట్రంలో మైనారిటీ మంత్రిగా, ఎమ్మెల్యేగా, తెలంగాణలో ఎమ్మెల్సీ గా ప్రజలకు అనేక సేవలు చేశారన్నారని గుర్తు చేశారు.