వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : కోయ గిరిజన సాంప్రదాయాలతో కుంకుమ భరిణే ఆదిశక్తి స్వరూపాలుగా, బెల్లం బంగారంగా తల్లులకు సమర్పించే అరుదైన జాతర. నాలుగు రోజులపాటు జరిగే ఆత్మాభిమాన జాతర. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా జరుపుకునే ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో జరిగే తెలంగాణ కుంభమేళా శ్రీ సమ్మక్క-సారలమ్మ జాతర. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతున్న వనదేవతల దర్శనానికై అందరి అడుగులు మేడారం వైపే పడుతున్నాయి. దారులన్నీ మేడారం వైపే చూస్తున్నాయి. ఇక్కడ అమ్మవార్లకు గుడి లేదు. విగ్రహాలు లేవు. అయినా మహిమ గల తల్లులు.మొక్కులు చెల్లించుకునేందుకు కోట్ల మంది భక్తులు ఎడ్ల బండ్లల్లో, వాహనాల్లో తరలివస్తారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరలో శివసత్తుల పూనకాలతో భక్తుల భక్తి పారవశ్యం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఎదురుకోళ్లతో వనదేవతలకు ఆహ్వానం. గిరిజనుల ఆచార, సాంప్రదాయం ప్రకారం వనదేవతలను మేడారం గద్దెల వద్దకు తీసుకువచ్చే క్రమంలో భక్తులంతా భక్తి పారవశ్యంతో నిండిపోతారు. మేడారం జాతర ప్రాంగణమంతా సమ్మక్క, సారలమ్మల నినాదాలతో హోరెత్తిపోతుంది. శివసత్తుల పూనకాలు, ఎదురుకోళ్లతో స్వాగతం పలకడం, తన్మయత్వంతో క్యూ లైన్లలో భక్తులు వనదేవతల కోసం ఎదురుచూడటం ఈ మహాఘట్టాన్ని చూడటానికి రెండు కళ్లు చాలవు అన్నట్లుగా అనిపిస్తుంది.
తెలంగాణ కుంభమేళాగా అభివర్ణించే సమ్మక్క సారలమ్మ జాతర విశిష్టతను గుర్తించి 1996లో నాటి ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించింది. ప్రతీ రెండేళ్లకొకసారి మాఘ మాసంలో ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో జరిగే ఈ జాతరకు కులమతాలకు అతీతంగా భక్తజనం తరలివస్తారు. తెలంగాణ రాష్ట్రంతో పాటు చత్తీస్ గఢ్, జార్ఖండ్, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్ తదితర పొరుగు రాష్ట్రాల నుండి కోటికి పైగా భక్తులు తల్లులను దర్శించుకుంటారు. భక్తుల దర్శనార్ధం తల్లులు స్వయంగా తరలివచ్చారనే తీరుగా వనదేవతల రాక మేడారం గ్రామానికి నూతన తేజాన్ని ఇస్తుంది. కోట్ల మంది దర్శించుకున్నా ఎవరికి ఇసుమంతైనా హాని జరగకపోవడం తల్లుల మహిమకు చిహ్నంగా భక్తులు భావిస్తారు.
అనంతమైన శౌర్య పరాక్రమాలతో తమనే సర్వస్వమని నమ్ముకున్న ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు వీరోచితంగా పోరాడి ఆత్మార్పణ చేసుకున్న వనదేవతలు సమ్మక్క, సారలమ్మలు. బతికున్నంత వరకే కాకుండా ఆ మట్టిలో కలిసిపోయి కూడా తమ వారి కోసం ప్రతీ రెండేళ్లకొకసారి బాహ్య ప్రపంచంలోకి వచ్చి తమ చెంతకు వచ్చిన ప్రజలను ఆశీర్వదించి సురక్షితంగా తిరిగి పంపించేంత మంచి మనసు వనదేవతలది. ఇక్కడి నేలను తాకినా జన్మధన్యమైపోతుందనే అద్భుతమైన భావన ప్రజల్లో పాతుకుపోయింది. దేశంలోని ఏ మూలన ఉన్నవారైనా ఒక్కసారి మేడారం వచ్చి వెళ్లారంటే ఆ జన్మాంతం వారు, వారి కుటుంబసభ్యులు తల్లుల భక్తులైపోతారు. ఇలా కోట్లాది మంది భక్తజనులను మేడారం రప్పిస్తున్నారంటే ఆ వనదేవతల మహిమ ఎలాంటిదో ఇట్టే అర్ధమైపోతుంది.
వీరత్వానికి ప్రతీకలు సమ్మక్క సారలమ్మలు..
కాకతీయ సైన్యం లక్నవరం సరస్సు దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుని యుద్ధానికి దిగింది. సమ్మక్క భర్త పగిడిద్దరాజు, కుమార్తెలు నాగులమ్మ, సారలమ్మ, అల్లుడు గోవిందరాజు సైన్యాన్ని మేడారం సరిహద్దులోని సంపెంగ వాగు వద్ద నిలువరించి, పోరాడి వీరమరణం పొందుతారు. కుమారుడు జంపన్న ఆత్మాభిమానంతో సంపెంగ వాగులో పడి ఆత్మాహుతి చేసుకున్నాడు. ఈ విషయం తెలిసి సమ్మక్క పరాశక్తి అవతారమెత్తింది. ఓటమి తప్పదని కాకతీయ సైనికులు దొంగచాటుగా బల్లెంతో పొడిచారు. సమ్మక్క యుద్ధభూమి నుంచి చిలుకల గుట్టకు వెళ్లి అదృశ్యమైంది.
మేడారంలో విగ్రహారాధన లేదు..
సమ్మక్క అదృశ్యమైన గుట్ట ప్రాంతంలో నాగవృక్షం దగ్గర ఒక కుంకుమ భరిణె లభించింది. ఆ భరిణెనే సమ్మక్కగా భావించి రెండేండ్లకు ఒకసారి మాఘ పౌర్ణమి రోజున పండుగ జరుపుకొనేవారు. అదే కాలక్రమేణా మేడారం సమ్మక్క సారలమ్మ జాతరగా రూపాంతరం చెందింది. పగిడిద్ద రాజు.. సారలమ్మ.. నాగులమ్మ.. జంపన్న.. గోవిందరాజు కూడా దైవ స్వరూపాలు అయ్యారు. నాలుగు రోజులపాటు ఈ జాతర ఘనంగా జరుగుతుంది. తొలిరోజున సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపైకి చేరుకుంటారు. గిరిజన సంప్రదాయంలో విగ్రహారాధన ఎక్కడా కనిపించదు. వెదురుకర్ర, కుంకుమ భరిణె తదితర ప్రతీకలే ఇక్కడ ఉత్సవ మూర్తులు. అప్పట్లో నెమలినార చెట్టు ఉన్న ప్రాంతమే నేటి గద్దె అని చెబుతారు.
సారలమ్మ రాక..
సమ్మక్క కూతురైన సారలమ్మ నివాసం కన్నెపల్లి. మేడారం గద్దెలకు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామంలోని చిన్న దేవాలయంలో సారలమ్మ కొలువై ఉంది. ఫిబ్రవరి 16 జాతరలో మొదటి రోజు. ఉదయాన్నే పూజారులు రెండు గంటలపాటు పూజలు నిర్వహించిన అనంతరం, సారలమ్మను కన్నెపల్లి నుంచి కాక వంశస్తులు గద్దె వద్దకు తీసుకొస్తారు. సమ్మక్క భర్త పగిడిద్దరాజు పూనుగొండ్ల నుంచి బయలుదేరి వస్తాడు. పగిడిద్దరాజును పెనక వంశీయులు తీసుకొస్తారు.
సారలమ్మ భర్త గోవిందరాజులను కొండాయి నుంచి మేడారంలోని గద్దెకు తీసుకొస్తారు. గోవిందరాజులను కూడా పెనక వంశస్తులే తీసుకొస్తారు. భక్తులు తడిబట్టలతో గుడి ఎదుట తల్లికి వందనం సమర్పిస్తారు. దేవతారూపాన్ని చేతబట్టుకుని బయటికి వచ్చిన పూజారులు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్న వారిపై నుంచి నడిచి వెళ్తారు. సారలమ్మే తమపైనుంచి వెళ్తున్న అనుభూతితో భక్తులు తరించిపోతారు. మంగళహారతులు, కొబ్బరి కాయలతో పూజలు చేసి సారలమ్మను మేడారానికి సాగనంపుతారు.
అక్కడినుంచి సారలమ్మను తీసుకుని బయల్దేరిన పూజారులు జంపన్న వాగునుంచి నేరుగా మేడారంలోని సమ్మక్క గద్దెల వద్దకు తీసుకొస్తారు. అంతకుమునుపే మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పూనుగొండ్లలోని బృందం పగిడిద్దరాజుతో బయల్దేరుతుంది. దాదాపు తొంభై కిలోమీటర్లు నడిచి జాతర నాటికి మేడారానికి వచ్చేస్తుంది. సారలమ్మ గద్దెకు చేరుకునే రోజే తండ్రి పగిడిద్దరాజు ప్రత్యక్షం అవుతాడు. సారలమ్మ భర్త గోవిందరాజులు ఏటూరు నాగారం మండలం కొండాయి గ్రామంలో కొలువై ఉంటాడు. జాతర రోజు ఉదయమే గ్రామస్తులంతా గోవిందరాజును తీసుకుని ఊరేగింపుగా మేడారానికి బయల్దేరతారు. అలా ఒకే రోజు సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులస్వామి గద్దెలపైకి చేరుకుంటారు.
కుంకుమ భరిణే దేవత..
రెండో రోజు అధికార లాంఛనాలతో పోలీసుల తుపాకీ కాల్పుల గౌరవ వందనం, ఎదురుకోళ్ల ఘట్టంతో భక్తులు సమ్మక్కను ఆహ్వానిస్తారు. ఉదయమే పూజారులు వనానికి వెళ్లి వెదురుకర్రలు తెచ్చి గద్దెలపై ప్రతిష్ఠిస్తారు. అనంతరం సమ్మక్క పూజా గృహం నుంచి వడ్డెలు పసిడి కుండలను తెచ్చి గద్దెలపై నెలకొల్పుతారు. పోలీసు భద్రత మధ్య పూజారులు సమ్మక్క ఆలయానికి చేరుకుంటారు. మేడారానికి ఈశాన్యాన చిలకల గుట్టపై నారచెట్టుకింద ఉన్న కుంకుమ భరిణె రూపంలోని సమ్మక్కను తెచ్చేందుకు పూజారులు బయల్దేరుతారు. ఈ సమయంలో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంటుంది. ఆనవాయితీలో భాగంగా మేడారంలోని చిలుకల గుట్టపై ఉన్న సమ్మక్క దేవతను కొక్కెర వంశస్తులు కుంకుమ భరిణె రూపంలో మేడారంలోని గద్దెకు తీసుకొస్తుంటారు. జాతర మొత్తానికి ప్రధాన దేవత అయిన సమ్మక్క రాక కోసం ఎదురుచూస్తున్న లక్షలాదిమంది భక్తులు చిలకల గుట్ట సమీపంలో పోగవుతారు. తల్లిని కనులారా చూడాలని తపిస్తారు. మహిమాన్వితమైన కుంకుమ భరిణెను తాకేందుకు ప్రయత్నిస్తారు. చిటారుకొమ్మలెక్కి తల్లిరాకకోసం ఎదురుచూస్తారు. ప్రధాన పూజారి ఒక్కరే చిన్న కాలిబాటన నడుచుకుంటూ చిలకల గుట్టపైకి వెళ్తాడు.
ఎదురుకోళ్లతో సమ్మక్కకు స్వాగతం..
చిలకల గుట్టపై రహస్య ప్రదేశంలో నిక్షిప్తమై ఉన్న సమ్మక్క దగ్గర సుమారు మూడు గంటలపాటు పూజలు నిర్వహిస్తారు. దేవత పూనిన పూజారి కుంకుమ భరిణె తీసుకుని అతివేగంగా కిందికి దిగుతాడు. గుట్ట మొదట్లో పోలీసులు రక్షణగా నిలబడతారు. సమ్మక్క ఆగమన సూచనగా పోలీసు అధికారులు గాలిలోకి మూడుసార్లు కాల్పులు జరిపి స్వాగతిస్తారు.
అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న భక్తుల్లో దేవుడు పూనిన శివసత్తులు ఊగిపోతారు. జై సమ్మక్క, జైజై సమ్మక్క అంటూ జయజయ ధ్వానాలతో మేడారం దద్దరిల్లుతుంది. గద్దెల వద్దే సమ్మక్కకు ఎదురుకోళ్లతో స్వాగతం పలుకుతారు. కోళ్లను అక్కడికక్కడే బలిస్తారు. మొదట పాము పుట్ట వద్ద, ఆపై సమ్మక్క గుడిలో ప్రత్యేక పూజల తర్వాత దేవతను కట్టుదిట్టమైన భద్రత మధ్య గద్దెలపైకి చేర్చుతారు. మాఘ పౌర్ణమి ఘడియలు ప్రవేశించిన వెంటనే లాంఛనంగా జాతర ప్రారంభం అవుతుంది. తల్లీబిడ్డలను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాదిమంది భక్తులు బారులు తీరుతారు.తిరిగి వనంలోకి..
ఉత్సవ మూర్తులంతా గద్దెలపై కొలువై మూడో రోజు అందరికీ దర్శనం ఇస్తారు. మహాజాతరలో ఈ మూడో రోజే అత్యంత కీలకం. తర్వాతి రోజు… అంటే జాతరలో చివరి రోజు వన దేవతలను మళ్లీ వనంలోకి సాగనంపుతారు. పూజారులు దేవతలను వనప్రవేశం చేయించడంతో మహాజాతర పరిపూర్ణం అవుతుంది. గద్దెలపై ఆసీనులైన సమ్మక్క, సారలమ్మలు మూడోరోజు అశేష జనావళికి దర్శనమిస్తారు. జంపన్నవాగులో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తల్లులను దర్శించుకుంటారు. కానుకలు, మొక్కులు సమర్పించుకుంటారు. తలనీలాలు, తులాభారాలు జరిపిస్తారు. మహిళలు ఒడిబియ్యం పోసి కొలుచుకుంటారు. చీరసారెలు పెట్టి పూజిస్తారు. దర్శనానికి వచ్చిన లక్షలాది మందితో గద్దెల ప్రాంగణాలు జన సముద్రమవుతాయి. ఆస్తి, కుల, మత భేదాలు లేకుండా అన్ని వర్గాల భక్తులు సమ్మక్క సారలమ్మలకు మొక్కులు అప్పగించుకోవాల్సిందే. వన దేవతలకు అత్యంత ప్రీతిపాత్రమైన వాటినే మొక్కులుగా సమర్పిస్తారు. భక్తులు తమ ఎత్తు బెల్లాన్ని బంగారంగా అమ్మ వార్లకు సమర్పిస్తారు. సారలమ్మ రాకతో ప్రారంభమై అమ్మల వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.