గుత్తాకు రెండోసారి వరించిన మండలి చైర్మన్ పదవి
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : శాసనమండలి చైర్మన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి రెండో సారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. మండలి చైర్మన్ గా సుఖేందర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికకు ఒకే ఒక్క నామినేషన్ రావడంతో గుత్తా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు మండలి అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో గుత్తా సుఖేందర్ రెడ్డిని చైర్మన్ సీటు వద్దకు మంత్రులు కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్సీలు తీసుకెళ్లారు. చైర్మన్ సీటులో ఆశీనులైన గుత్తా సుఖేందర్ రెడ్డికి మంత్రులు పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. 2019, సెప్టెంబర్ 11న తొలిసారిగి గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించారు. 2021, జూన్ మొదటి వారం వరకు గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి చైర్మన్ గా సేవలందించారు.గుత్తా ఎమ్మెల్సీ పదవీకాలం ముగియడంతో, ఆయన స్థానంలో ప్రొటెం చైర్మన్ గా ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డిని నియమించారు. అనంతరం మండలి ప్రొటెం చైర్మన్ గా ఎమ్మెల్సీ సయ్యద్ అమీనుల్ హసన్ జాఫ్రీ నియామకం అయ్యారు. శాసనమండలికి 2021లో జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీ కోటా ఎమ్మెల్సీగా గుత్తా సుఖేందర్ రెడ్డి రెండోసారి నవంబర్ 22న ఎన్నికయ్యారు. ఈ క్రమంలో మళ్లీ ఆయన రెండో సారి మండలి చైర్మన్ గా నేడు బాధ్యతలు స్వీకరించారు.
గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబ నేపథ్యం..
నల్లగొండ జిల్లా ఊరుమడ్ల గ్రామంలో 1954, ఫిబ్రవరి 1న జన్మించిన గుత్తా సుఖేందర్ రెడ్డి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పట్టా పొందారు. 1977, మే 1న అరుంధతితో వివాహం జరిగింది. వీరికి ఒక కుమారుడు , ఒక కుమార్తె ఉన్నారు.
గుత్తా రాజకీయ నేపథ్యం..
గుత్తా సుఖేందర్ రెడ్డి తన రాజకీయ ప్రస్థానాన్ని కమ్యూనిస్టు పార్టీ నుంచి ప్రారంభించారు. కమ్యూనిస్టు పార్టీలో చురుకుగా పని చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లో పని చేశారు. 2004 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి గెలుపొందారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున అదే నియోజకవర్గం నుంచి మళ్లీ ఎంపీగా విజయం సాధించారు. 2014 జనరల్ ఎన్నికల్లోనూ ఎంపీగా గెలుపొంది, 2016, జూన్ 15న టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018లో గుత్తాను సీఎం కేసీఆర్ రైతు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారు. 2019 ఆగస్టులో ఎమ్మెల్యే కోటాలో తొలిసారిగా మండలికి ఎన్నికయ్యారు.
ఈ క్రమంలో రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019, సెప్టెంబర్ 11న మండలి చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2021, జూన్ 3న గుత్తా సుఖేందర్ రెడ్డి పదవీకాలం ముగిసింది. 2021, నవంబర్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోసారి గుత్తా సుఖేందర్ రెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఈనేపథ్యంలో రెండో సారి ఆయనను మండలి చైర్మన్ పదవి వరించింది.