రాజ్యసభకి హర్భజన్ సింగ్ నామినేట్..!
వరంగల్ టైమ్స్, పంజాబ్ : టీంఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ రాజ్యసభకి వెళ్లనున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభకు ఎంపిక చేసిన నలుగురిలో క్రికెటర్ హర్భజన్ సింగ్ ఒకరు. హర్భజన్ సింగ్ తో పాటు ఢిల్లీ ఎమ్మెల్యే రాఘవ్ చద్దా, ఐఐటీ ఢిల్లీ ప్రొఫెసర్ డాక్టర్ సందీప్ పాఠక్ లను రాజ్యసభకి నామినేట్ చేస్తూ ఆప్ నిర్ణయం తీసుకుంది. పంజాబ్ లోని ఏడుగురు రాజ్యసభ సభ్యులలో 5 మంది పదవీకాలం ఏప్రిల్ 9 తో ముగుస్తుంది. మార్చి 31న ఎన్నికలు జరుగనున్నాయి. రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఆరేండ్లు ఉండనున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవల జరిగిన పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో 117 స్థానాలకు గాను ఆమ్ ఆద్మీ పార్టీ 92 స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.