వరంగల్ జిల్లా : గత మూడ్రోజులుగా ఎడతెరలిలేకుండా కురిసిన వడగండ్ల వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లింది. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన ఈ వర్ష బీభత్సానికి అపాన పంట నష్టం, భారీ వృక్షాలు నేలకొరిగాయి, పలు చోట్ల విద్యుత్ స్థంభాలు విరిగిపోయి, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. పలు రకాల పంటలు పూర్తిస్థాయిలో దెబ్బతిని రైతులకు కడగండ్లు మిగిల్చాయి. గత మూడ్రోజులుగా కురిసిన వర్షం ప్రభావానికి పరకాల నియోజకవర్గంలో గల పరిస్థితులను స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. తాను ఎక్కడ ఉన్నా నియోజకవర్గ ప్రజల శ్రేయస్సే లక్ష్యంగా ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పనిచేస్తున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా తిరుపతిలో ఉన్న ఎమ్మెల్యే చల్లా వడగండ్ల వర్షం వల్ల తన నియోజకవర్గంలో ఏర్పడ్డ పరిస్థితులను సంబంధిత అధికారులను టెలికాన్ఫరెన్స్ లో అడిగి తెలుసుకున్నారు.
రెవెన్యూ , వ్యవసాయ అధికారులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతు బంధు సమితి సభ్యులు, ముఖ్య కార్యకర్తలు, రైతులతో టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడారు. పరకాల నియోజకవర్గంలో వర్షం వల్ల దెబ్బ తిన్న పంటల గురించి అడిగి తెలుసుకున్నారు. చేతికి వచ్చిన పంట నేలరాలిన దృశ్యాలు చూస్తుంటే తట్టుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతిలో ఉండటం వల్ల ఆకస్మికంగా పడిన వడగండ్ల వర్షానికి పంటలు దెబ్బతిన్న రైతులను నేరుగా కలువలేకపోతున్నానని ఎమ్మెల్యే చల్లా ఆదేవనచెందారు. రెవెన్యూ అధికారులు నియోజకవర్గంలోని ప్రతీ గ్రామంలో పర్యటించి అకాల వర్షానికి దెబ్బతిన్న అన్ని రకాల పంటలను పరిశీలించాలని సూచించారు. దీనికి సంబంధించిన పూర్తి స్థాయి నివేదికను తనకు సమర్పించాలని ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులను ఆదేశించారు.
హనుమకొండ, వరంగల్ జిల్లాలలో జరిగిన భారీ పంట నష్టం గురించి మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు సహకారంతో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లినట్లు చల్లా ధర్మారెడ్డి తెలిపారు. రైతులు ఎవరు అధైర్య పడవద్దని అన్నారు. పంట నష్టం జరిగిన ప్రతీ రైతును ప్రభుత్వం 100 శాతం ఆదుకుటుందని భరోసా ఇచ్చారు. అధికంగా మిర్చి, మొక్కజొన్న, కొన్ని చోట్ల పసుపు పంటలు దెబ్బతిన్నాయని అన్నారు. రైతులకు ఎల్లప్పుడూ సీఎం కేసీఆర్ అండగా ఉంటారని అన్నారు. నియోజకవర్గంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతుబంధు సమితీ సభ్యులు కలిసి గ్రామాలలో పూర్తి స్థాయిలో పర్యటించి ప్రతీ రైతు పంటను సందర్శించి నష్టం జరిగిన పంటల వివరాలు రైతుల నుండి సేకరించి రైతులకు భరోసా కల్పించాలని కోరారు. తాను కూడా హుటాహుటిన తిరుపతి నుండి బయల్దేరుతున్నట్లు తెలిపారు. నేరుగా హైదరాబాద్ వచ్చి మంత్రి దయాకర్ రావు తో కలిసి సీఎం కేసీఆర్ ని కలిసి రైతులు నష్టపోయాయిన పంట వివరాలు తెలియచేస్తానన్నారు. బాధిత రైతులకు ప్రభుత్వం నుంచి 100 శాతం పరిహారం అందేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
అధికారులు, ప్రజాప్రతినిధులు గ్రామాలలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు. ఎలాంటి సమస్యలు తలెత్తిన వెంటనే తెలియపరుచాలని సూచించారు. అకాల విపత్తులపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. రేపు పంట నష్టపోయిన రైతులను నేరుగా కలుస్తానని తెలిపారు. టెలికాన్ఫరెన్స్ లో ఆర్డీఓలు మహేందర్ జి, వసుచంద్ర, జిల్లా వ్యవసాయ అధికారి ఉషా దయాళ్, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, రైతుబంధు సమితి సభ్యులు, టీఆర్ఎస్ మండల, గ్రామ స్థాయి నాయకులు, రైతులు, ఎమ్మార్వోలు, సొసైటీ చైర్మన్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు, 15 ,16 ,17 డివిజన్ల కార్పొరేటర్లు, ఎడిఎ, ఈవోలు, ఏఈఓలు తదితరులు పాల్గొన్నారు.