సైనాకు సారీ చెప్పిన హీరో సిద్ధార్థ్
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : ఇండియన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ కు హీరో సిద్ధార్థ్ బహిరంగ క్షమాపణలు చెప్పాడు. ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ లో పర్యటించిన సందర్భంలో ఎదురైన భద్రతా లోపంపై సైనా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్ పై సిద్ధార్థ స్పందిస్తూ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది.
దీంతో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న సందర్భంలో ట్వీట్ పై వివరణ ఇచ్చాడు. తాను ఎవరినీ కించపరచలేదని, తన ట్వీట్ లో ఎలాంటి అభ్యంతరం లేదని పేర్కొంటూనే సైనాకు క్షమాపణలు చెబుతూ బహిరంగ లేఖ విడుదల చేశారు.
సైనా ట్వీట్ పై తాను పెట్టిన పోస్ట్ ఒక జోక్ మాత్రమేనని వివరణ ఇచ్చాడు. తాను పెట్టిన కామెంట్ చాలా మందిని బాధించిందని, మహిళలను కించపరుస్తూ కామెంట్ చేయాలనే ఉద్దేశం తనది కాదంటూ వివరణ ఇచ్చాడు. సైనా నెహ్వాల్ ఎప్పుడూ ఒక గొప్ప క్రీడాకారిణి అని, తాను ఆమెను గౌరవిస్తానని చెప్పారు. తాను పెట్టిన పోస్టు చాలా మందిని బాధపెట్టిందని , కావున ఆ పోస్ట్ పై క్షమాపణ కోరుతున్నానంటూ సిద్ధార్థ్ ట్వీట్ చేశాడు.