వరంగల్ టైమ్స్, హైదరాబాద్: ఏడు జిల్లాల పరిధికి విస్తరించి ఉన్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ(హెచ్ఎండిఏ) అభివృద్ధిలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇకపై దూరదృష్టితో కొత్త ప్రణాళికలను రూపొందించుకుంటూ ముందుకు సాగాలని హెచ్ఎండీఏ ఉన్నతాధికారులకు కేటీఆర్ సూచించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం తొలిసారిగా అమీర్ పేట్ లోని హెచ్ఎండీఏ కార్యాలయానికి వచ్చారు. హెచ్ఎండీఏ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మెట్రోపాలిటన్ కమిషనర్, స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అర్వింద్ కుమార్ హెచ్ఎండిఏ కార్యాచరణను మంత్రికి వివరించారు.
తదుపరి ఇంజనీరింగ్, ప్లానింగ్, అర్బన్ ఫారెస్ట్రీ వంటి విభాగాల వారీగా మంత్రి కేటీఆర్ సమీక్షించి పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సంబంధిత అధికారులకు కొన్ని సూచనలు చేశారు. మంత్రి సమీక్ష సమావేశానికి హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్(హెచ్జిసిఎల్) ఎండి సంతోష్ ఐఏఎస్, అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ బి.ప్రభాకర్ ఐఎఫ్ఎస్, హెచ్ఎండీఏ సెక్రెటరీ పి.చంద్రయ్య, చీఫ్ ఇంజినీర్ బి.ఎల్.ఎన్.రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్లు బాలకృష్ణ, శివశరణప్ప, ఎస్టేట్ ఆఫీసర్ కె.గంగాధర్, సీఐఓ హరినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.