ప్రతిపక్షం గొంతు వింటే ఉలిక్కిపాటెందుకు ?
వరంగల్ టైమ్స్, తూర్పుగోదావరి జిల్లా : వైసీపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన లాంటి మాటలకు అర్థం తెలియదని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ పాలకులకు రాజ్యాంగ విలువలపై ఏ మాత్రం గౌరవం కనిపించడం లేదు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసీపీ సీఎం జగన్ భావిస్తున్నారని అన్నారు. ఈ రోజు సాయంత్రం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలను తెలియచేస్తోందని పవన్ కల్యాణ్ తీవ్రంగా ధ్వజమెత్తారు.
ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్ళిన చంద్రబాబుని అడ్డుకొనేందుకు పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి? అని పవన్ ప్రశ్నించారు. ప్రజలు తమ నిరసనలు తెలిపేందుకు రోడ్డుపై బైఠాయించడం చూస్తాం గానీ, విధి నిర్వహణలోని పోలీసులు రోడ్డు మీద కూర్చోవడం వైసీపీ పాలనలోనే చూస్తున్నామని ఎద్దేవా చేశారు. సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయాల్సి వచ్చిందంటే వారిపై పాలకుల ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పవన్ కల్యాణ్ దుయ్యబట్టారు.
జనవాణి కార్యక్రమం కోసం నేను విశాఖపట్నం వెళ్తే వీధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారని జనసేన అధ్యక్షుడు అన్నారు. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి, బాధితులను పలకరించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారని మండిపడ్డారు. నడుస్తుంటే నడవకూడదని ఆంక్షలు పెట్టారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది? ప్రభుత్వాన్ని ప్రశ్నించేవాళ్ళను సహించలేని స్థితికి వైసీపీ పాలకులు చేరారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే ఈ పాలకులకు జీర్ణం కావడం లేదన్నారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని ఈ పాలకులు తెలుసుకోవాలని పవన్ కల్యాణ్ సూచించారు.