సెంచూరియన్ : సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో ప్రారంభమైన తొలి టెస్ట్ లో టీంఇండియా టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక్కడ ఇది వరకు ఎప్పుడూ టెస్ట్ సిరీస్ గెలవని నేపథ్యంలో ఈ సారి ఎలాగైనా చరిత్ర తిరగరాయాలని కోహ్లీ సేన భావిస్తోంది. అయితే అదే దిశగా తొలి టెస్ట్ ఆడుతున్న టీం ఇండియాకు శుభారంభం దక్కింది.
ఓపెనర్లు మయాంక్ అగర్వాల్ (46), కేఎల్ రాహుల్(29) నిలకడగా ఆడటంతో మొదటి ఇన్నింగ్స్ లంచ్ బ్రేక్ టైంకి టీం ఇండియా వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. పేస్ బౌలింగ్ కు అనుకూలించే దక్షిణాఫ్రికా పిచ్ ల మీద టాస్ నెగ్గిన టీంఇండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్ సిరీస్ లో రాణించిన మయాంక్ అగర్వాల్ కు తోడుగా చాలా రోజుల తర్వాత టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బ్యాటింగ్ కు వచ్చాడు. అయితే వీరిద్దరూ సమన్వయంతో ఆడుతూ ప్రొటీస్ బౌలర్లకు ఎలాంటి ఛాన్స్ ఇవ్వకుండా పరుగులు చేస్తున్నారు. ఈ క్రమంలో మయాంక్ అగర్వాల్ అర్ధశతకం దిశగా సాగుతున్నాడు. ఎంగిడి, రబాడ, జాన్సెన్, మల్డెర్ వంటి ఫాస్ట్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేసినా వికెట్ మాత్రం రాలేదు.
హక్కుల కార్యకర్త, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆర్చ్ బిషప్ డెస్మండ్ టుటు (90) మృతికి సంతాప సూచికంగా భారత్, దక్షిణాఫ్రికా టీం క్రికెటర్లు కొద్దిసేపు మౌనం పాటించారు. ఇక తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు ఇరుజట్ల ఆటగాళ్లు టుటుకు నివాళులర్పించారు. టుటు గౌరవార్థం ప్రొటీస్ ప్లేయర్లు నల్ల బ్యాండ్ లను ధరించి మైదానంలోకి దిగారు.