‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ పోస్టర్ విడుదల
వరంగల్ టైమ్స్, సినిమా డెస్క్ : కామెడీ చిత్రాలతో కడుపుబ్బా నవ్వించిన నేటి తరం కామెడీ స్టార్ అల్లరి నరేష్. కామెడీ చిత్రాలే కాదు, విశాఖ ఎక్స్‌ప్రెస్, గమ్యం, నాంది వంటి వైవిధ్యమైన కథాంశాలున్న చిత్రాల్లోనూ నటించి నటుడిగా మెప్పించారాయన. ఆయన కథానాయకుడిగా నటిస్తోన్న 59వ చిత్రం టైటిల్‌ను ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’గా ఖరారు చేశారు. సోలో బ్రతుకే సో బెటర్, రిపబ్లిక్, బంగార్రాజు వంటి వరుస సక్సెస్ఫుల్ మూవీస్‌ను అందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ సమర్పణ, నిర్మాణంలో, మరో నిర్మాణ హాస్య మూవీస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఎ.ఆర్.మోహన్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రానికి రాజేష్ దండు నిర్మాత. బాలాజీ గుత్త సహ నిర్మాత. ఆనంది హీరోయిన్గా నటిస్తున్నారు.శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. టైటిల్‌ను గమనిస్తే చుట్టు అడవి మధ్యలో కొందరు గ్రామస్థులు పిల్లలతో సహా నిలుచుని ఉన్నారు. వారి ముందు ఓ యువకుడు బల్లెం పట్టుకుని ధైర్యంగా నిలబడి ఉన్నారు. అందరి ముందున్న చెరువులో వారి ప్రతిరూపాలు కనిపిస్తున్నాయి. వెన్నెల కిషోర్, ప్రవీణ్ ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అబ్బూరి రవి ఈ చిత్రానికి మాటలను అందిస్తున్న ఈ చిత్రానికి శ్రీ చరణ్ పాకాల సంగీత సారథ్యం వహిస్తున్నారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్. ఛోటా కె.ప్రసాద్ ఎడిటర్. బ్రహ్మ కడలి ప్రొడక్షన్ డిజైనర్‌గా, యాక్షన్ డైరెక్టర్‌గా పృథ్వి వర్క్ చేస్తున్నారు.