వరంగల్ టైమ్స్,జనగామ జిల్లా: ఫిబ్రవరి 11న జనగామలో జరుగబోయే సభ ప్రతిపక్షాలకు సవాల్ గా నిలవాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. ఈ నెల 11న సీఎం కేసీఆర్ జనగామ పర్యటన సందర్భంగా వరంగల్ జిల్లాలోని రాయపర్తిలో ఏర్పాటు చేసిన సన్నాహక సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ వచ్చాకే రాష్ట్రంలో అప్రతిహత అభివృద్ధి జరిగిందన్నారు. ప్రతీ గ్రామానికి కోట్ల కొద్ది నిధులు వచ్చాయి. గతంలో మంచినీటికి కూడా గతి లేదు.
వచ్చే మార్చి నుంచి స్థలాలు ఉన్న అర్హులైన వాళ్లకు ఇండ్లు ఇస్తాం. వచ్చే మూడేళ్లలో దళితులందరికీ దళిత బంధు ఇస్తాం. రాజ్యాంగాన్ని సవరించాలనడం నేరం కాదు. కావాలని కొందరు కల్పిత వివాదం సృష్టిస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వాటిని టీఆర్ఎస్ శ్రేణులు తిప్పి కొట్టాలని, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని, దుష్ప్రచారం చేస్తున్న వాళ్లను నిలదీయాలని మంత్రి ఎర్రబెల్లి స్పష్టం చేశారు.
రైతులు, దళితులు, రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇవన్నీ వివరించడానికే సీఎం కేసీఆర్ జనగామ సభ పెడుతున్నారని మంత్రి తెలిపారు. అలాంటి సభను సూపర్ సక్సెస్ చేయాల్సిన బాధ్యత ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఉందని, వారంతా స్వచ్ఛందంగా కదిలి రావాలని దయాకర్ రావు పిలుపునిచ్చారు. అత్యధిక పార్టీ సభ్యత్వం ఉన్న మన ఇంటి పార్టీ టీఆర్ఎస్ పవర్ ఏంటో చూపించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, శ్రేణులు పాల్గొన్నారు.