కొత్త ఏడాదిలో.. కొత్త విధానం
కొత్త పాలసీ తీసుకువచ్చిన ప్రభుత్వం
ఇకపై వెంచర్ పరిధిలో లేక్స్ సంరక్షణ డెవలపర్స్ దే
అనుమతుల సమయంలోనే పరిశీలన
కొత్త అనుమతులకు ఇది వర్తింపు
హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ( హెచ్ఎండిఏ), గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలో ఉన్న చెరువులు, కుంటలు, జలవనరులు (వాటర్ బాడిస్) సంరక్షణకు, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. చెరువులు, కుంటలు, జలవనరులు (వాటర్ బాడిస్) సంరక్షణ చర్యల ద్వారా భవిష్యత్తు తరాలకు పచ్చదనం(గ్రీనరీ) సమతుల్యత అందించడానికి ఆయా ప్రాంతాల ప్రజలకు ఆహ్లాదాన్ని కలిగించే కేంద్రాలుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది.
ప్రపంచంలో అత్యుత్తమ నగరాలలో ఒకటిగా నిలిచి అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన నగరం హైదరాబాద్. ఈ నగరం పరిసరాల్లోని చెరువుల(లేక్స్)ను వారసత్వ సంపదగా కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని ఇటీవల జరిగిన సమావేశంలో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్.. స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ కు సూచించారు. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలో భారీ అంచనాలతో రియల్ ఎస్టేట్ విస్తరణ చెందుతుంది. ఆయా ప్రాంతాల్లో అప్పటికే ఉన్న చెరువులు, కుంటలు ఆదరణకు నోచుకోకపోవడం, కొన్నింటిలోకి అనధికారికంగా సివరేజ్ చేరుతుంది.
ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు, స్థానిక పరిస్థితులను చక్కదిద్దేందుకు ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న చెరువులు, కుంటల(లేక్స్) సంరక్షణ, అభివృద్ధి, పూర్వ వైభవం కల్పించే భాధ్యతలను స్థానిక డెవలపర్స్ కు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. లే అవుట్, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ (ఎంఎస్ బి), గేటెడ్ కమ్యూనిటీ, కమర్షియల్ కాంప్లెక్స్ వంటి వాటికి అనుమతి ఇచ్చే సమయంలో వారి డెవలప్ మెంట్ ఏరియాలో ఉన్న లేక్స్ అభివృద్ధి బాధ్యతలు వారే నిర్వహించాల్సి ఉంటుంది. వాటర్ బాడీకి 500 మీటర్ల విస్తీర్ణం(పరిధి) వరకు వాటి నిర్వహణ సంబంధిత డెవలపర్లు లేదా ఏజెన్సీలు అభివృద్ధి బాధ్యతలు చేపట్టాలి.