వరంగల్ టైమ్స్,ఫిల్మ్ డెస్క్: టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ పరుశురామ్ పెట్లా దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ పేరుతో ఓ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇటీవల స్పెయిన్ లో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించిన చిత్రబృందం, తుది షెడ్యూల్ ను తాజాగా హైదరాబాద్ లో జరుపుకుంటోంది. ఇదిలా ఉండగా ఈ సినిమా నుంచి కళావతి అనే సాంగ్ లీకైనట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రారంభం నుంచి ఈ మూవీ అప్ డేట్ విషయంలో చిత్రబృందం కంటే లీక్ వీరులు ముందుగా స్పందిస్తున్నారు.
తాజాగా ఈ సినిమాలోని మొదటి పాటను ఫిబ్రవరి 14న విడుదల చేయాలని టీం భావించింది. అందులో భాగంగానే ఈ పాటకు సంబంధించిన ప్రోమోను వదిలారు. అయితే లీక్ వీరులు మాత్రం ముందే ఈ పాటను వదిలారు. దీంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే చర్చ జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఏం చేస్తుందంటూ మహేష్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంత మంది అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని , ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే మరోవైపు చిత్రబృందం తాజాగా విడుదల చేసిన కళావతి పాట ప్రోమో ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. దీంతో దీనికి సంబంధించి టీం ఓ పోస్టర్ ను విడుదల చేసింది. అంతేకాదు ఈ ప్రోమో ఇప్పటికే 5 మిలియన్ పైగా వ్యూస్ ను సాధించి అదరగొడుతోంది. ఇక దీనికి సంబంధించి ఫుల్ సాంగ్ ను ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదల చేస్తున్నట్లు ఓ పోస్టర్ విడుదల చేశారు. ఇక ఈ సినిమా అంతా అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కావాల్సి ఉండేది. కానీ ఈ సారి సంక్రాంతికి రాజమౌళి ఆర్ఆర్ఆర్ మరోవైపు భీమ్లానాయక్, ప్రభాస్, రాధే శ్యామ్ ఇలా మూడు సినిమాలు వస్తున్నట్లు ప్రకటించాయి. ఈనేపథ్యంలో సర్కారు వారి పాట సినిమా విడుదల వాయిదా పడింది. కానీ ఆయా సినిమాలు కరోనా థర్డ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడ్డాయి.