వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : తెలంగాణ సీఎం కేసిఆర్ మనసులో నుంచి ఆవిర్భవించిన పథకాల్లో దేశంలోనే ఆదర్శవంతమైన పథకం ‘దళితబంధు’ పథకమని రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొప్పుల ఈశ్వర్, సత్యవతిరాథోడ్, చీఫ్ విప్ వినయ్‌భాస్కర్ అన్నారు. గురువారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లో అన్నినియోజకవర్గాల్లో దళితబంధు అమలు, లబ్ధిదారుల ఎంపికపై ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, పెద్ది సుధర్శన్‌రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి, నన్నపునేని నరేందర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ పాడి కౌషిక్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, జెడ్పీ చైర్మైన్లు డా.సుధీర్‌కుమార్, గండ్ర జ్యోతి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, జిల్లా కలెక్టర్‌లు, సంక్షేమశాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 5వరకు ప్రతీ నియోజకవర్గం నుంచి 100 మంది లబ్దిదారుల ఎంపికను పూర్తి చేయాలని వారు సూచించారు. మార్చిలోపు ఎంపికైన లభ్ధిదారుల ఖాతాల్లో ప్రభుత్వం ద్వారా 10 లక్షలు జమ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని దళిత కుటుంబాలు ఆర్థిక పురోగతి సాధించాలన్నదే సీఎం కేసిఆర్ లక్ష్యమని అన్నారు. అనంతరం మంత్రులు మీడియాతో మాట్లాడారు.
గత ప్రభుత్వాలు దళితులను విస్మరించాయని ఈ సందర్భంగా మంత్రులు గుర్తు చేశారు. దళిత బంధుతో దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని మంత్రులు అన్నారు. లబ్దిదారుల ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలదేనని సూచించారు. మొదట ప్రతి నియోజకవర్గంలో 100మంది లబ్దిదారులను ఎంపిక చేస్తామని, విడతల వారిగా ప్రతీ దళిత కుటుంబానికి దళితబంధు పథకం అందిస్తామని మంత్రులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు అనుభవించిన పేదరికాన్ని పారదోలేందుకు దళితబంధు ఆయుధంలా పనిచేస్తుందన్నారు.