‘మా ఏపీ’ ఎన్నికలకు రంగం సిద్ధం.. నామినేషన్ల స్వీకరణ మొదలు: ‘ఏపీ మా’ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ దిలీప్ రాజాహైదరాబాద్ : ‘మా ఏపీ’ ఎన్నికలకు రంగం సిద్ధం చేసినట్లు ఆ సంస్థ వ్యవస్థాపకుడు, దర్శకుడు దిలీప్ రాజా తెలిపారు. గతంలో కరోనా వలన యూనియన్ నియమ నిబంధనల మేరకు సకాలంలో ఎన్నికలు నిర్వహించలేదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కార్యవర్గంలో అధ్యక్షులుగా ఉన్న సీనియర్ నటి కవిత, ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు, కార్యదర్శి అన్నపూర్ణల పదవీ కాలం ముగిసిందని ఆయన తెలిపారు.
జాయింట్ సెక్రటరీగా ఉన్న సీనియర్ హాస్య నటి శ్రీలక్ష్మి తెలంగాణా ‘మా’ ఎన్నికల్లో పోటీ చేసిన కారణంగా ఆమెను పదవి నుంచి నియమ నిబంధనల మేరకు రెండు యూనియన్లలో ఉండే అవకాశం లేదు కాబట్టి ఆమెను మా ఏపి నుండి తొలగించినట్లుగా దిలీప్ రాజా వివరించారు. రాష్ట్ర విభజన అనంతరం విభజన చట్టం నిబంధనల మేరకు ఏపీలో సినీ పరిశ్రమ అభివృద్ధి కావాలనే ఆలోచనతో 2018లో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ 24 విభాగాలతో యూనియన్ను ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం హెచ్ – 196 నంబర్ తో 14.2.2018 న ఆమోదించినట్లుగా దిలీప్ రాజా తెలిపారు. 24 విభాగాలకు చెందిన 400 మంది టెక్నీషియన్లకు, నటీనటులు ఇందులో సభ్యులుగా చేరినట్లు ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖ, ‘మా ఏపి’కి ఆమోదం ఇస్తే కాదనే అధికారం ఎవరికీ లేదని ఆయన పేర్కొన్నారు. అయితే తాము హైదరాబాద్లోని ‘మా’కు ఎంత మాత్రం వ్యతిరేకం కాదన్నారు. విభజన జరిగింది కాబట్టి తాము ఏపీలో ‘మా ఏపీ’ నీ నెలకొల్పామని ఆయన తెలిపారు. తామంతా ఒకే కుటుంబం అని దిలీప్ రాజా స్పష్టం చేశారు. ఆంధ్రలో సినీ పరిశ్రమ అభివృద్ధికి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మా ఏపి సంస్థ పని చేస్తుందని ఆయన చెప్పారు.
కాగా మా ఏపీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఎవరైనా భారతీయుడు అయివుంటే చాలు, పోటీ చేసే సౌలభ్యం ఉందన్నారు. నాయకత్వ లక్షణాలున్న ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయవచ్చని ఆయన తెలిపారు. అయితే పోటీ చేసే అభ్యర్థులు విధిగా భారతీయులు అయి ఉండాలని, అలాగే విధిగా మా ఏపీ లో సభ్యత్వం కలిగి ఉండాలని ఆయన చెప్పారు. 24 విభాగాల్లో పలు శాఖల్లోని సాంకేతిక నిపుణులు కూడా ఎన్నికల బరిలో పాల్గొన వచ్చని ఆయన తెలిపారు.
ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు ‘మా ఏపి ఎన్నికలు, మా ఏపీ కార్యాలయం, ఆలపాటి నగర్, సుల్తానాబాద్, తెనాలి 522 201, ఆంధ్రప్రదేశ్’ చిరునామాకు తమ దరఖాస్తును తెల్ల కాగితంపై రాసి పంపవచ్చని ఆయన వివరించారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి, ట్రేజరర్, ఈసీ మెంబర్లకు ఎన్నికలు జరుపుతున్నట్లు దిలీప్ రాజా ప్రకటించారు. ప్రస్తుతం నామినేషన్ల స్వీకరణ జరుగుతున్నట్లుగా ఆయన తెలిపారు. ఎన్నికల తేదీని మార్చ్ 31 అనంతరం ఎన్నికల అధికారి ప్రకటిస్తారని ఆయన వివరించారు.