రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు
వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : ఈ నెల 18న మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో హనుమకొండలోని శ్రీ రుద్రేశ్వరస్వామి వేయిస్థంభాల దేవాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభం కానున్నాయని ప్రధాన అర్చకులు గంగు ఉపేంద్ర శర్మ, ఈవో శేషగిరి తెలిపారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఫిబ్రవరి 17 నుంచి ఫిబ్రవరి 21 వరకు జరుగు ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి 17న ఉదయం 4.30 ని.లకు సుప్రభాతం, ఉదయం 5.30 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం అంకురార్పణతో ప్రారంభమవుతుంది. ఈ రోజు కలశ స్థాపన, చండీహోహము నిర్వహించనున్నారు.
ఫిబ్రవరి 18న వచ్చే మహా శివరాత్రి పర్వదినానికి ప్రత్యేకత ఉందని గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. 23యేళ్ల తర్వాత మహా శివరాత్రి రోజున శని త్రయోదశి రావడం అనేది చాలా గొప్ప విషయమని ఆయన పేర్కొన్నారు. ఉదయం 3.30 ని.లకు సుప్రభాతం, ఉదయం 4 గంటల నుంచి స్వామి వారికి సామూహిక రుద్రాభిషేకంలు, నిత్య విధి హవనము , సాయంత్రం 6.45 గంటలకు శ్రవణా నక్షత్రయుక్త సింహ లఘ్న సుముహూర్తాన రుద్రేశ్వర స్వామి, రుద్రేశ్వర దేవీ కళ్యాణోత్సవం జరుగనున్నట్లు తెలిపారు. రాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలమందు శ్రీ స్వామివారికి మహాన్యాస పూర్వక మహారుద్రాభిషేకము , జాగరణ భక్తుల కొరకు కల్చరల్ కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలిపారు. దాత, ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త వద్దిరాజు వెంకటేశ్వర్లు దంపతుల సౌజన్యంతో సాయంత్రం 4 గంటలకు పురాణ ప్రవచకులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శర్మచే శివతత్వంపై పురాణ ప్రవచనం ఉంటుందని తెలిపారు. అలాగే ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు జరిగే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకై ఆలయంలో ఫ్లవర్ డెకరేషన్ ఏర్పాటు చేయబడి ఉంటుందని తెలిపారు.
దాతలు మంచికట్ల గోపీనాథ్, రజిత దంపతుల సౌజన్యంతో ఫిబ్రవరి 19న ఉదయం 5గంటలకు సుప్రభాతం, గణపతి పూజ, స్వామి వారికి రుద్రాభిషేకములు నిర్వహించబడును. మహాపూజ, అర్చనలు, తీర్థప్రసాద వితరణలు, నాగవెల్లి నిర్వహించబడును. ఫిబ్రవరి 20న దాతలు పెనుగాల వాసుదేవరెడ్డి, సునీత దంపతుల సౌజన్యంతో ఉదయం 5 గంటలకు సుప్రభాతం, గణపతి పూజ, శ్రీ స్వామి వారికి రుద్రాభిషేకం, తీర్థప్రసాద వితరణలు, అత్యంత వైభవంగా అన్నపూజ, అన్నప్రసాద వితరణ నిర్వహించబడును. సాయంత్రం అర్చనలు, మహాపూజ నిర్వహించబడును. ముగింపు రోజు ఫిబ్రవరి 21న దాతలు పైరెడ్డి క్రిష్ణ సావంత్ , సరోజ దంపతుల సౌజన్యంతో ఉదయం 5 గంటలకు సుప్రభాతం, గణపతి పూజ, శ్రీ రుద్రేశ్వరస్వామి వారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకములు, బిల్వార్చనలు, శ్రీ ఆంజనేయస్వామి వారికి చందనోత్సవము, ఆకుపూజ, పూర్ణాహుతి, సాయంత్రం 4 గంటలకు పండిత సత్కారము, మహదాశీర్వచనము, తీర్థప్రసాద వినయోగములు నిర్వహించబడును.
దేశంలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో ఎలాగైతే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఎలాగైతే నిర్వహిస్తారో అదే స్థాయిలో వేయిస్థంభాల రుద్రేశ్వరుడికి కల్యాణోత్సవాలు నిర్వహిస్తామని ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు. దాతల సహకారంతో ఇక బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. భక్తులకు త్రాగునీరు, పారిశుధ్య సౌకర్యాలు, అన్నదాన వసతి కోసం అన్ని చర్యలు తీసుకున్నామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చే నేపథ్యంలో ట్రాఫిక్ కు ఇబ్బంది కలుగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఇక ఆలయంలో క్యూ లైన్ల ఏర్పాట్లు, వీఐపీల దర్శనం నేపథ్యంలో హనుమకొండ సీఐ ఆధ్వర్యంలో భద్రతా ఏర్పాట్లు, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారి ఆధ్వర్యంలో జాగరణ భక్తులు ఆరోగ్యానికి ఇబ్బందులు కల్గకుండా మెడికల్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు.
ఇక జీడబ్ల్యూఎంసీ ఆధ్వర్యంలోనే మొదటిసారిగా మహాశివరాత్రి పర్వదినాన శ్రీ రుద్రేశ్వరుని వేయిస్థంభాల ఆలయంలో లైటింగ్ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయమని గంగు ఉపేంద్ర శర్మ అన్నారు. కోరిన కోర్కెలు తీర్చే, మహిమాన్వితమైన శ్రీ రుద్రేశ్వరుని కల్యాణ బ్రహ్మోత్సవాలను తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని వారు కోరారు.