వరంగల్ అర్బన్ జిల్లా: హన్మకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌజ్ లో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ వరంగల్ మహా నగర పాలక సంస్థ అభివృద్ధి సమీక్షలో పాల్గొన్నారు. వరంగల్ మహా నగర పాలక సంస్థ అభివృద్ధి పనులు, జరుగుతున్న ప్రగతి మీద సంబంధిత అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రతి డివిజన్ సర్వాంగ సుందరంగా కనిపించాలి… నగరం అద్దంలా మెరవాలి… సిసి రోడ్లు, డ్రైనేజీ సహా అన్ని పనులు పూర్తి కావాలి… అవసరమైన సిబ్బంది నియామకాలను చేపట్టండి.. ఎట్టి పరిస్థితుల్లోనూ అదికారులు అభివృద్ధిలో రాజీ పడొద్దు… నిర్లక్ష్యంగా ఉండే అధికారులను ఉపేక్షించేది లేదు… పని చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టండి అంటూ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. ఆయా పథకాల పనితీరును కూలంకషంగా చర్చించిన మంత్రి అధికారులకు తగు సూచనలు, సలహాలు ఇచ్చారు.ఇటీవల వరదల్లో తెగిపోయిన రోడ్లు, వరద, మురుగునీటి కాలువల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 59 కోట్ల నిధులతో వెంటనే పనులు ప్రారంభించి, యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఎర్రబెల్లి అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో పూర్తైన డబుల్ బెడ్ రూం ఇండ్లను వచ్చే యేడాది ఫిబ్రవరిలో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన నిరుపేదలను లాటరీ పద్ధతిలో ఎలాంటి వివాదాలకు తావులేకుండా ఎంపిక చేయాలని చెప్పారు. స్మార్ట్ సిటీ పనులలో వేగం పెంచి, నిర్దేశ గడువులోగా వాటిని పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా స్మార్ట్ రోడ్ల కింద ఆర్ 1, ఆర్ 2, ఆర్3, ఆర్4, పనులు జనవరి చివరి కల్లా పూర్తి కావాలని ఆదేశించారు. నగరానికి నాలుగువైపులా ఏర్పాటు చేస్తున్న స్వాగత తోరణాల పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఆయా అభివృద్ధి పనులు శీఘ్ర గతిన జరిగేలా కాంట్రాక్టర్ల వెంటపడి అధికారులు పనులు చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆదేశించారు. ఈ సమీక్షలో మేయర్ గుండా ప్రకాశ్ రావు, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, అరూరి రమేశ్, నన్నపనేని నరేందర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతు, కమిషనర్ పమేలా సత్పతి, బల్దియా ఎస్ ఇ విద్యాసాగర్, ఇఇ లు, పబ్లిక్ హెల్త్ డిఇలు ఇతర అధికారులతో మంత్రి చర్చించారు. వరంగల్ మహానగరంలో ఫిబ్రవరి నెల నుంచి ప్రతి రోజూ, ఇంటింటికీ స్వచ్ఛమైన మిషన్ భగీరథ మంచినీటిని అందించాలని ఆదేశించారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సిబ్బంది, ఇతర సమస్యలేమున్నా వాటిని వెంటనే పరిష్కరించాలని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మంచినీటిని అందించే విధంగా అంకిత భావంతో కృషి చేయాలని మంత్రి చెప్పారు. అయితే, నగర పాలక సంస్థలో ప్రస్తుతం మంజూరైన పోస్టుల్లో కేవలం 45శాతం మాత్రమే సిబ్బంది ఉన్నారని, మిగతా సిబ్బంది నియామకాలు అవసరమని అధికారులు మంత్రి దృష్టికి తీసుకురాగా, వెంటనే ఆయా పోస్టుల భర్తీ కి అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.