స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : సికింద్రాబాద్ లో ఎప్పుడూ రద్దీగా ఉండే స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. 8 ఫ్లోర్ల్ ఉన్న స్వప్న లోక్ కాంప్లెక్స్ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఎలక్ట్రికల్ ప్యానెల్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ ఏర్పడటం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించింది. 4, 5 ,6 ఫ్లోర్లలో మంటలు చెలరేగి దట్టమైన పొగలు భవనమంతా వ్యాపించాయి. అగ్ని ప్రమాదం జరిగినప్పుడు 4,5 ఫ్లోర్లలో 25 మంది చిక్కుకున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. 10 ఫైర్ ఇంజన్లతో సకాలంలో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది, మంటలను అదుపుచేసే ప్రయత్నం చేస్తున్నారు. దట్టమైన పొగ వల్ల కొంతమంది ఊపిరాడక సొమ్మసిల్లి పడిపోయారని సమాచారం.
అయితే మంటల్లో, దట్టమైన పొగల్లో చిక్కుకున్న వారికోసం ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేసింది. ఈ ప్రమాదంలో చిక్కుకుపోయిన సుమారు 15 మందిని కాపాడి గాంధీ ఆస్పత్రికి అంబులెన్స్ లో తరలించారు. అయితే వీరిలో చికిత్స పొందుతూ ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారిని ప్రమీల, వెన్నెల, శ్రావణి, త్రివేణి, శివగా గుర్తించారు. సాయంత్రం సుమారు 7 గంటల సమయానికి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. 4 గంటల శ్రమ అనంతరం అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
అయితే స్వప్నలోక్ కాంప్లెక్స్ పాత భవనం కావడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండటానికి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయని నగర మేయర్ విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ ,హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీసీపీలు సుమతి, చందనా దీప్తి తెలిపారు. అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని పరిశీలించారు. దగ్గరుండి ప్రమాద నివారణ చర్యలు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చినట్లు తెలిపారు.