ఉమెన్ హెల్త్ కి రుతు ప్రేమ : హరీష్ రావు
వరంగల్ టైమ్స్, సిద్దిపేట : స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో జాతీయ స్థాయి, దక్షిణాది రాష్ట్రాల్లో మొదటి స్థానంలో నిలిచిన సిద్దిపేట మున్సిపాలిటీ మరో ముందడుడు వేసింది. పట్టణ వ్యాప్తంగా మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని “రుతు ప్రేమ” అనే కార్యక్రమానికి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతీ మహిళకు రుతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, చిన్న పిల్లలకు బట్ట డైపర్లను ఉచితంగా పంపిణీ చేసే ఓ సరికొత్త ఆలోచనకు హరీశ్ రావు అంకురార్పణ చేశారు. ఈ కార్యక్రమాన్ని సిద్దిపేటలోని 5వ వార్డులో హరీశ్ రావు బుధవారం ప్రారంభించి, మహిళలకు రుతుస్రావ కప్పులు, బట్ట ప్యాడ్లు, పిల్లలకు డైపర్లు అందించారు.
బట్ట ప్యాడ్స్ వాడటంలో ప్రపంచానికే సిద్దిపేట ఆదర్శంగా నిలవాలన్నారు. రుతుస్రావం గురించి మాట్లాడటానికి ఇబ్బందికరంగా ఉంటుంది. ఐనప్పటికీ దీనిపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతీ నెల జరిగే రుతుస్రావ ప్రక్రియలో బట్ట ప్యాడ్లు, రుతుస్రావ కప్పులు వాడటం వల్ల ఆరోగ్య సమస్యలు రావు. డబ్బు వృథా కాదని మంత్రి స్పష్టం చేశారు.
5వ వార్డు ప్రజలు తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడంలో ఆదర్శంగా నిలిచారని హరీష్ రావు గుర్తు చేశారు. ఈ క్రమంలోనే రుతు ప్రేమ కార్యక్రమానికి ఈ వార్డును పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశామని తెలిపారు. మీ ఆరోగ్యాన్ని మీరే కాపాడుకోవాలి. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని మంత్రి సూచించారు. జిల్లాలోని మహిళ ఉద్యోగులకు త్వరలోనే అవగాహన సదస్సును ఏర్పాటు చేసి, బట్ట ప్యాడ్స్ పంపిణీ చేస్తామని హరీష్ రావు వెల్లడించారు.