వరంగల్ టైమ్స్, హనుమకొండ జిల్లా : సీనియర్ బీజేపీ నేత, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే చందుపట్ల జంగారెడ్డి ఎంతో మంది రాజకీయ నాయకులకు ఆదర్శంగా నిలిచారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలో జరిగిన జంగారెడ్డి అంతిమయాత్రలో ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. జంగారెడ్డి మృతి పట్ల ఆయన తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
పరకాలలో జన్మించిన చందుపట్ల జంగారెడ్డి కొద్ది రోజుల పాటు ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారని గుర్తు చేశారు. కొన్ని దశాబ్దాలుగా రాజకీయంలో ఉంటూ ఒక ప్రజాప్రతినిధిగా తనదైన శైలిలో ప్రజలకు సేవలనందించారని ఎమ్మెల్యే చల్లా కొనియాడారు. నేడు ఆయన భౌతికంగా లేకపోవడం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వారి మరణం రాజకీయ రంగానికి తీరని లోటని ఎమ్మెల్యే చల్లా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.