వరంగల్ టైమ్స్, వరంగల్ జిల్లా : తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ హయాంలో గ్రామాలు అభివృద్ధిలో పరుగులు పెడుతున్నాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో గత పాలకులు తెలంగాణ అభివృద్ధిని విస్మరించారని గుర్తు చేశారు. అభివృద్ధి అంటే ఏంటో చేతల్లో సుసాధ్యం చేస్తున్న సీఎం కేసీఆర్ అని ఆయన కొనియాడారు. పరకాల నియోజకవర్గంలోని పరకాల మండలం నాగారం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి బుధవారం పర్యటించారు.
ఈ పర్యటనలో భాగంగా గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం గ్రామంలో రూ. 30 లక్షలతో నూతనంగా చేపట్టనున్న సిసి రోడ్డు పనులకు చల్లా ధర్మారెడ్డి భూమిపూజ చేశారు. పలు అభివృద్ధి పనుల ప్రారంభం, శంఖుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డికి స్థానిక గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్నఅభివృద్ధిని గ్రామ ప్రజలకు తెలిపారు.