వరంగల్ జిల్లా : ఐనవోలు మల్లికార్జున స్వామిని తెలంగాణ తొలి మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్, వరంగల్ డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ మార్నేని రవిందర్ దర్శించుకున్నారు. ఐనవోలు మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సంక్రాంతి పర్వదినాన స్వామి వారిని దర్శించుకున్న ఎమ్మెల్యేలకు ఆలయ అధికారులు, కమిటీ సభ్యులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. మల్లన్న స్వామికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వచనం అందించారు. స్వామి వారి బండారిని, చిత్రపటాలను ఆలయ అర్చకులు ఎమ్మెల్యేలకు బహుకరించారు.
అనంతరం ఎమ్మెల్యేలు ఆలయ విశిష్టత, మల్లన్న మహిమలపై మాట్లాడారు. ప్రతీ యేటా భోగి, సంక్రాంతి పర్వదినం నుంచి మహా శివరాత్రి వరకు కొనసాగే ఐనవోలు మల్లన్న జాతరకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఉమ్మడి జిల్లా నుంచే కాకుండా తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. భక్తుల సౌకర్యార్థం ఆలయ ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. గతంతో పోల్చుకుంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఐనవోలు మల్లన్న జాతరలో చాలా అభివృద్ధి జరిగిందన్నారు. భక్తులంతా కొవిడ్ నిబంధనలతో తరలివచ్చి మల్లన్న స్వామిని దర్శించుకుని వెళ్లాలని ఎమ్మెల్యేలు డా.టి రాజయ్య, అరూరి రమేష్ కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.