హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ కి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని, ప్రతీ ఎన్నికకు సవాల్ చేయడం కరెక్ట్ కాదని కవిత బండి సంజయ్ తీరుపై ఫైర్ అయ్యారు. హుజురాబాద్ నియోజకవర్గంలో గెల్లు శ్రీనివాస్ విజయాన్ని ఎవరూ ఆపలేరన్నారు. నిన్న మమతా బెనర్జీ గెలిచింది.. ప్రధాని మోడీ రాజీనామా చేస్తారా ? మమతా బెనర్జీ ఎన్నిక బీజేపీ ఛాలెంజ్ గా తీసుకుంది కదా ? అని ఎద్దేవా చేశారు.
కేవలం మీడియాలో కనిపించేందుకే బండి సంజయ్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఎవరైనా హుందాగా వ్యవహరిస్తే బాగుంటుందని తెలిపారు. రాజకీయాలను ప్రతిపక్షాలు ఎక్కడికి తీసుకెళ్తారో అర్థం కావడం లేదని మండిపడ్డారు. కేసీఆర్ గెలిచినన్ని ఎన్నికలు ఎవ్వరూ గెలువలేదని ఎమ్మెల్సీ కవిత గుర్తు చేశారు.
హుజురాబాద్ నియోజకవర్గ ఉపఎన్నికల్లో భాగంగా ఆదివారం రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆ నియోజకవర్గంలో ప్రచారం ప్రారంభించారు. ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. అంతేకాదు హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతే కేసీఆర్ తన సీఎం పదవికి రాజీనామా చేస్తారా ? అని సవాల్ విసిరారు. అయితే బండి సంజయ్ చేసిన సవాల్ కు సోమవారం రోజు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్లు ఇచ్చారు.