ఆనం కోసం ఎంపీ రాయబారం ఫలించేనా..!
వరంగల్ టైమ్స్, అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. నాన్చుడు కాదు..ఇక తేల్చుడే అనే నిర్ణయానికి వచ్చేశారు. వై నాట్ 175 అంటూ వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్నారు. కొంత మంది ఎమ్మెల్యేల పని తీరు మెరుగు పర్చుకొనేందుకు డెడ్ లైన్ ఫిక్స్ చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేల వ్యవహార శైలి పైన ఫోకస్ పెట్టారు. అసమ్మతి, విభేదాలు ఉన్న నియోజకవర్గాల్లో ట్రీట్మెంట్ కు సీఎం జగన్ సిద్దమయ్యారు. అందుకోసం సీఎం జగన్ స్వయంగా రంగంలోకి దిగుతున్నారు. సర్వే నివేదికల ఆధారంగా ఎమ్మెల్యేలు – పార్టీ మధ్య సమస్యలు ఉన్న నియోజకవర్గాలపై రివ్యూలకు రెడీ అయ్యారు. కీలక నిర్ణయాలకు అవకాశం కనిపిస్తోంది. ఆనం అంశంపై సీఎం వద్దకు ఒక ఎంపీ రాయబారం తెచ్చారని సమాచారం.
ఆనం కోసం ఎంపీ రాయబారం ఫలించేనా..
సీనియర్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి ప్రభుత్వం పైన వరుసగా వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఫలితంగా ఆనం ప్రాతినిధ్యం వహిస్తున్న వెంకటగిరి నియోజకవర్గంలో నేదురుమల్లి రాం కుమార్ రెడ్డిని పార్టీ ఇంఛార్జ్ గా నియమించారు. ఆనం పార్టీని వీడే ఆలోచనలోనే ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
ఐతే, వచ్చే ఎన్నికల్లో ప్రతీ నియోజకవర్గం కీలకం కావటంతో అదే జిల్లాకు చెందిన ఒక ఎంపీ, సీఎం జగన్ వద్ద ఆనం అంశం పైన చర్చించినట్లు తెలుస్తోంది. తదుపరి చర్యలు వద్దని కోరినట్లు సమాచారం. సీఎం జగన్ తో సమావేశం అయ్యేందుకు ఆనంకు అవకాశం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు చెబుతున్నారు. ఐతే, సీఎం ఇప్పుడు ఆనం విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటారు…అప్పాయింట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.