ఏపీలో 7 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ
వరంగల్ టైమ్స్, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలిలో ఈనెలాఖరుకు ఖాళీ అవుతున్న 7 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఎన్నికకు సంబంధించి సోమవారం ఏపీ రాష్ట్ర శాసన మండలి సంయుక్త కార్యదర్శి మరియు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పివి.సుబ్బారెడ్డి ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేశారు. శాసన మండలి సభ్యులు చల్లా భగీరధ్ రెడ్డి పదవీ కాలం గత నవంబరు 2న పూర్తి కాగా, ప్రస్తుత సభ్యులు నారా లోకేశ్, పోతుల సునీత, బచ్చుల అర్జునుడు, డొక్కా మాణిక్య వరప్రసాద రావు, వరాహ వెంకట సూర్యనారాయణ రాజు పెనుమత్స, గంగుల ప్రభాకర్ రెడ్డిల పదవీకాలం ఈనెల 29తో ముగియనుంది. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధుల ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం గత నెల 27న ఎన్నికల షెడ్యూల్ ను ప్రకటించగా సోమవారం ఇందుకు సంబంధించిన ఎన్నికల ప్రకటనను ఎన్నికల రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి జారీ చేశారు.
పివి.సుబ్బారెడ్డి ఈ ఎన్నికకు సంబంధించి ఫారమ్-1 ద్వారా సోమవారం ఎన్నికల ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేయగల అభ్యర్ధులు స్వయంగా గాని లేదా వారి ప్రతిపాదకుడు గాని వెలగపూడిలోని రాష్ట్ర శాసనసభా భవనంలో రిటర్నింగ్ అధికారైన తన వద్దగాని లేదా సహాయ రిటర్నింగ్ అధికారి మరియు శాసన మండలి ఉపకార్యదర్శికి గాని వారి నామినేషన్లను సమర్పించవచ్చని సుబ్బారెడ్డి తెలిపారు.ఈ నెల 6 నుండి 13 వరకు సెలవు దినాలు మినహా మిగతా పనిదినాల్లో ఉదయం 11గం.ల నుండి మధ్యాహ్నం 3గం.ల వరకు నామినేషన్లు స్వీకరించడం జరుగుతుందని పేర్కొన్నారు. నామినేషన్ పత్రాలను పై పేర్కొన్న స్థలం, సమయాల్లో పొందవచ్చని వివరించారు. ఈనెల 14న ఉదయం 11గం.లకు అసెంబ్లీ భవనంలో నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.
ఈనెల 16న మధ్యాహ్నం 3గం.ల వరకు నామినేషన్ల ఉసంహరణకు గడువు ఉంటుందని ఆ గడువులోగా ఎవరైనా అభ్యర్ధులు వారి నామినేష్లనను ఉపసంహరించుకోవాలనుకుంటే అభ్యర్ధిత్వ ఉపసంహరణ నోటీసును అభ్యర్ధి లేదా వారి ప్రతిపాదకుడు లేదా వ్రాత పూర్వకంగా అందించేందుకు అధికారం పొందిన వారి ఎన్నిక ఏజెంటు గాని రిటర్నింగ్ అధికారి లేదా సహాయ రిటర్నింగ్ అధికారికి గాని అందజేయాల్సి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీ ఉన్నచో ఈనెల 23న ఉదయం 9గం.ల నుండి సాయంత్రం 4గం.ల వరకూ అసెంబ్లీ భవనంలో పోలింగ్ జరుగుతుందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన వెంటనే అదే రోజు అనగా 23న సాయంత్రం 5గం.లకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని రిటర్నింగ్ అధికారి సుబ్బారెడ్డి పేర్కొన్నారు.