ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’..!
‘డెల్టా’ రకం కంటే ప్రమాదకరం..!!
టీకా తీసుకున్నవారికీ ముప్పు..?
వణుకుతున్న ప్రపంచ దేశాలు..
దక్షిణాఫ్రికా, బోట్స్‌వానాల్లో పెరుగుతున్న కేసులు..
తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ వెలుగులోకి..
వివిధ దేశాల్లో ప్రయాణ ఆంక్షలు షురూ..
డబ్ల్యూహెచ్‌వో అత్యవసర భేటీ..
తీవ్రంగా వ్యాపిస్తుందని హెచ్చరిక..
లండన్, జెనీవా, జెరూసలేం: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాల్లో వణుకు పుట్టిస్తోంది! కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టి, బతుకులు మళ్లీ గాడిన పడుతున్న తరుణంలో… ఇది మరో ఉద్ధృతికి దారితీయవచ్చన్న ఆందోళనలు రేకెత్తుతున్నాయి. కొద్దిరోజుల కిందట దక్షిణాఫ్రికాలో కనిపించిన ‘బి.1.1.529’ వేరియంట్ పొరుగుదేశం బోట్స్‌వానాతో పాటు హాంకాంగ్‌కూ వ్యాపించింది. తాజాగా ఇజ్రాయెల్, బెల్జియంలోనూ ఈ కేసులు నమోదయ్యాయి. కొవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నవారికీ ఈ వేరియంట్ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి..!
అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్త వేరియంట్ ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ స్టాక్ మార్కెట్లు శుక్రవారం పతనమయ్యాయి. ఐరోపా, ఆసియాల్లోని ప్రధాన ఇండెక్స్‌లు కుదేలయ్యాయి. అమెరికాలో మార్కెట్ ప్రారంభం కావడానికి ముందే డౌ జోన్స్ ఫ్యూచర్స్ 800 పాయింట్లు కోల్పోయింది. ముడి చమురు ధరలు 7% తగ్గాయి. పలు ఎయిర్‌లైన్స్ షేర్లూ భారీగా దెబ్బతిన్నాయి.
కేసులు పెరగడానికి అదే కారణమా..?
దక్షిణాఫ్రికాలో సగటున రోజూ 200 మంది కరోనా బారిన పడుతుండగా… నాలుగైదు రోజుల నుంచి కేసులు భారీగా పెరుగుతున్నాయి. కొత్త వేరియంటే ఇందుకు కారణమా? అన్నది మాత్రం ప్రభుత్వం చెప్పడం లేదు. తాజాగా మలావి నుంచి ఇజ్రాయెల్‌కు వచ్చిన ఓ వ్యక్తికి ‘బి.1.1.529’ సోకింది. మరో ఇద్దరు కూడా దీనిబారిన పడినట్టు అనుమానిస్తున్నారు. ఈ ముగ్గురూ పూర్తిస్థాయి వ్యాక్సిన్ తీసుకున్నవారే కావడంతో ప్రపంచ వ్యాప్తంగా వైద్య నిపుణులు విస్తుపోతున్నారు! తాజా పరిణామాల క్రమంలో- ఇజ్రాయెల్ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్ అత్యవసరంగా కేబినెట్ సమావేశం ఏర్పాటుచేసి, కొత్త వేరియంట్‌పై సమీక్షించారు. తమ దేశం అత్యయిక పరిస్థితి ఆరంభంలో ఉన్నట్టు వ్యాఖ్యానించారు.
అక్కడి నుంచి రావద్దు…
దక్షిణాఫ్రికా సహా మొత్తం ఆరు దేశాల నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులపై ఇజ్రాయెల్ ఆంక్షలు విధించింది. బ్రిటన్‌లో ఇప్పటివరకూ బి.1.1.529 వేరియంట్ నమోదు కాకపోయినా… దక్షిణాఫ్రికా, బోట్స్‌వానా, లెసాతో, ఎస్వాతిన్, జింబాబ్వే, నమీబియాల నుంచి రాకపోకలపై నిషేధం విధిస్తున్నట్టు ఆ దేశం శుక్రవారం ప్రకటించింది. జర్మనీ, ఇటలీ, సింగపూర్, జపాన్‌లు కూడా ఈ దిశగా చర్యలు చేపట్టాయి. దక్షిణాఫ్రికా తదితర దేశాల నుంచి వచ్చేవారిపై ప్రయాణ ఆంక్షలు విధించేందుకు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలు అంగీకారం తెలిపాయి.
భారత్‌లో ఆ కేసుల్లేవు: ఇన్సాకాగ్
దిల్లీ: కొత్త వేరియంట్‌కు సంబంధించి దేశంలో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా వెలుగుచూడలేదని ఇండియన్ సార్స్-కొవ్-2 జీనోమిక్స్ కన్సార్షియం (ఇన్సాకాగ్) వెల్లడించింది. ప్రజలంతా కొవిడ్ నిబంధనలను పాటించాలని సూచించింది. కొత్త వేరియంట్‌ను పర్యవేక్షిస్తున్నామని, ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించామని కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి.
అత్యంత ఆందోళనకర రకం..!
కొత్త వేరియంట్‌కు తీవ్రంగా వ్యాపించే లక్షణాలు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. దీన్ని ‘ఆందోళనకర వేరియంట్ (వేరియంట్ ఆఫ్ కన్సర్న్)’గా వర్గీకరించి, ‘ఒమిక్రాన్’ అని పేరు పెట్టింది. కొద్దిరోజుల కిందటే ‘వేరియంట్ అండర్ మానిటరింగ్’గా గుర్తించిన బి.1.1.529పై చర్చించేందుకు శుక్రవారం ఉన్నతాధికారులు, నిపుణులతో డబ్ల్యూహెచ్‌వో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై విస్తృత స్థాయిలో చర్చించి నిర్ణయాన్ని వెల్లడించింది.
ఏంటీ కొత్త వేరియంట్..?
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఈ కరోనా వేరియంట్‌ను ‘బి.1.1.529’గా శాస్త్రవేత్తలు గుర్తించారు. దీని కారణంగా ఇప్పటివరకూ దక్షిణాఫ్రికాతో పాటు హాంకాంగ్, బోట్స్‌వానా, ఇజ్రాయెల్, బెల్జియంలోనూ కేసులు వెలుగు చూశాయి.
వ్యాప్తి తీవ్రత ఎలా ఉంది..?
దక్షిణాఫ్రికాలోని గౌతెంగ్ ప్రావిన్సులో ఈ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు స్థానిక వైద్య నిపుణులు వెల్లడించారు. ఇక్కడ నమోదవుతున్న వాటిలో 90% కేసులకు ఈ వేరియంటే కారణమని చెబుతున్నారు. మరో ఎనిమిది ప్రావిన్సుల్లోనూ ఈ వేరియంట్ వ్యాపించి ఉండవచ్చని తెలుస్తోంది.
అంత భయమెందుకు..?
బి.1.1.259 చాలా అసాధారణ వైరస్ ఉత్పరివర్తనాల కలయికగా శాస్త్రవేత్తలు గుర్తించారు. శరీర రోగనిరోధక శక్తిని ఇది ఏమార్చి, విస్తృతంగా వ్యాపించవచ్చని భావిస్తున్నారు. ఈ వేరియంట్‌కు గనుక వ్యాక్సిన్ల నుంచి తప్పించుకోగల, లేదంటే మునుపటి డెల్టా కంటే తీవ్రంగా వ్యాపించే సామర్థ్యం ఉంటే.. మరోసారి కొవిడ్ ఉద్ధృతి తప్పకపోవచ్చని హెచ్చరిస్తున్నారు.
ఎందుకు భిన్నం..?
కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి చూసిన వేరియంట్ల కంటే బి.1.1.529 అత్యంత ప్రమాదకరమైనదని సీనియర్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వైరస్ స్పైక్ ప్రొటీన్‌లో 32 ఉత్పరివర్తనాలు ఉన్నాయని, డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఇవి రెట్టింపు అని వారు విశ్లేషించారు.
ఠారెత్తిస్తున్న ‘ఒమిక్రాన్’..!
ఆందోళనకర వైరస్‌ల కంటే బి.1.1.529 వేగంగా వ్యాపిస్తున్నట్టు లెక్క తేలింది. దక్షిణాఫ్రికాలో బీటా, డెల్టా వేరియంట్లు వెలుగుచూసిన తర్వాత పాతిక రోజుల్లోపు మొత్తం కేసుల్లో వీటి వాటా 20%లోపే. ఇదే కాలంలో బి.1.1.529 కారక కేసులు 90% నమోదవుతున్నాయి.