ముంబై: మహారాష్ట్రలోని ముంబై నగరంలో ఒమైక్రాన్ వేరియెంట్ కేసుల సంఖ్య శనివారం నాటికి 17కు పెరగడంతో ముంబై అధికారులు అప్రమత్తమయ్యారు. ముంబైలో ఒమైక్రాన్ వేరియెంట్ కరోనా కట్టడి చేసేందుకు శనివారం, ఆదివారాల్లో రెండు రోజుల పాటు 144 సెక్షన్ ను అమలు చేస్తున్నట్లు ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు.
144 సెక్షన్ అమలు సందర్భంగా ముంబై నగరంలో శని, ఆదివారాల్లో ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు, ఎక్కువ మంది జనం గుమిగూడే సమావేశాలను నిషేధిస్తున్నట్లు ముంబై డిప్యూటీ పోలీసు కమిషనర్ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
నిషేధ ఉత్తర్వులను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
శుక్రవారం 7 ఒమైక్రాన్ వేరియెంట్ కేసులు నమోదైనాయి. మూడేళ్ల వయసుగల బాలుడికి కూడా ఒమైక్రాన్ సోకడంతో ప్రజలు కలవరపడ్డారు.
ముంబైలో 3 కేసులు, పింప్రీ చించ్ వద్ మున్సిపల్ కార్పొరేషన్ లో 4 కేసులు వెలుగుచూశాయి. ఒమైక్రాన్ కరోనా వైరస్ సోకిన ముగ్గురు రోగులు టాంజానియా, యూకే, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చారని ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు.
దేశంలో మొత్తం 32 ఒమైక్రాన్ కేసులు నమోదు కాగా అందులో మహారాష్ట్రలోనే 17 కేసులున్నాయి. రాజస్థాన్ రాష్ట్రంలో 9, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీలలో ఒమైక్రాన్ కేసులు వెలుగుచూశాయి.