ఎమ్మెల్సీ కవిత కార్తీకపౌర్ణమి ప్రత్యేక పూజలు

హైదరాబాద్ : కార్తీకపౌర్ణమి సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచే భక్తులు ఆలయాలకు క్యూ కట్టారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శైవక్షేత్రాలు, శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భద్రాచలం, ధర్మపురి, మంథనీల్లో భక్తులు గోదావరి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కార్తీక సోమవారం వేళ దేవాలయాలకు కార్తీక శోభ సంతరించుకుంది. అటు కార్తీకపౌర్ణమి సందర్భంగా శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాలకు సైతం భక్తుల రద్దీ పెరిగింది.కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బంజారా హిల్స్ లోని శివాలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు చేశారు. గత కొన్ని సంవత్సరాల నుంచి కార్తీక పౌర్ణమి రోజున ప్రత్యేక పూజలు చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఈ ఏడాది కూడా ఆ శివుడి దయ వల్ల ఇక్కడ అభిషేకం చేయడం జరిగిందన్నారు.