పట్టభద్రుల ఎన్నికలపై పీడీఎఫ్ ఎమ్మెల్సీల విమర్శ
వరంగల్ టైమ్స్, అమరావతి : బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో అభివృద్ధి ఊసేలేదని పిడిఎఫ్ ఎమ్మెల్సీలు అన్నారు. శాసనమండలిలో పిడిఎఫ్ పక్షం నాయకులు విఠపు బాలసుబ్రమణ్యం, ఎమ్మెల్సీలు కెఎస్ లక్ష్మణరావు, ఐ.వెంకటేశ్వరరావు, షేక్ సాబ్జీ మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. ఆరోగ్యశ్రీ ద్వారా కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నా ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయడం లేదన్నారు. గత పదేళ్లలో 54 సాగునీటి ప్రాజెక్టులు చేపట్టగా, ఇంతవరకు 14 మాత్రమే పూర్తయ్యాయని, 2 ప్రాజెక్టులు పాక్షికంగా పూర్తయ్యాయని తెలిపారు.
పోలవరం, వెలుగొండ ఎప్పటికి పూర్తవుతాయో గవర్నరు ప్రసంగంలో చెప్పలేకపోయారని అన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రాజెక్టులు ప్రాధాన్యతగా లేవన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంటు చేస్తామని చెప్పి, కనీస వేతనం ఇచ్చామంటూ చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. పర్మినెంటు చేసే ప్రస్తావన లేదన్నారు. సంక్షేమ పథకాలను మాత్రమే గవర్నర్ తో చెప్పించిన ప్రభుత్వం రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ఎలా అబివృద్ధి పథంలో నడిపిస్తుందో చెప్పలేకపోయిందని పిడిఎఫ్ పక్షం నాయకులు ఎద్దేవా చేశారు.
పంటలకు గిట్టుబాటు ధరలు, కౌలు రైతుల సమస్యల ప్రస్తావన లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత నాలుగేళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ కూడా జారీ చేయని ప్రభుత్వం ఇదేనని అన్నారు. ప్రతి ఏటా జనవరిలో ఇస్తామన్న జాబ్ క్యాలెండరు ప్రస్తావన లేదన్నారు. రాష్ట్రంలో 50,670 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని విమర్శించారు. గ్రామాల్లో ఏకోపాధ్యాయ పాఠశాలలు పెరిగిపోతున్నాయని అన్నారు. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇవ్వడం లేదన్నారు. క్రమంగా ఏకోపాధ్యాయ పాఠశాలలను ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.46 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాఇంత వరకు భర్తీ గురించి పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. అవుట్సోర్సింగ్, స్కీమ్ వర్కర్ల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
వ్యవసాయ రంగానికి వైసీపీ మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను అమలు చేయలేదన్నారు. ప్రధానంగా ధరల స్థిరీకరణ గురించి పట్టించుకోలేదన్నారు. రాష్ట్రంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి బాగుందని చెప్పుకుంటున్నా 10 లక్షల ఎకరాల్లో ఏ పంటలూ వేయకుండా ఖాళీగా ఉంచిన విషయాన్ని విస్మరించరాదన్నారు. నీరు సమృద్ధిగా ఉన్నా రైతులు పంటలు వేయడానికి ముందుకు రాలేదన్నారు. సంక్షేమ పథకాల అమలుతో పాటు మౌలిక వసతుల కల్పన, సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య రంగాల పట్టిష్టతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసిపి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా రీపోలింగ్ జరపాల్సిన అగత్యం ఏర్పడటం దారుణమన్నారు.