రాజకీయాలలో భౌతిక దాడులు సరికాదు : ఎర్రబెల్లి
మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్యకు కుట్ర ఆందోళనకరం
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదు : మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద వెలుగు చూసిన హత్యాయత్నం కుట్రను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. రాజకీయాల్లో భౌతిక దాడులు సరికాదని మండిపడ్డారు. ఇలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేదని మంత్రి అన్నారు. ప్రజా జీవితం ప్రజల సేవకు అంకితం కావాలన్నారు. రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలి తప్ప నేరమయం చేయొద్దని హెచ్చరించారు. అలా ఎవరైనా ఆలోచించినా తప్పే అన్నారు. ప్రజా జీవితంలో ఉండేవాళ్లు, ఉండాలనుకునే వాళ్లు పనిచేసి ప్రజల ఆదరణ పొందాలి. కానీ రాజకీయ ప్రత్యర్ధులపై భౌతిక దాడులకు పాల్పడాలి అనుకోవడం, హత్యా రాజకీయాలకు కుట్రలు చేయడం నేరమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత ఏడేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ దిశానిర్దేశంలో రాష్ట్రం సహా, మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసే దిశగా ముందుకు సాగుతున్నాం. పాలమూరు జిల్లా ప్రశాంతమైన జిల్లా. ఆ వాతావరణం కలుషితం కావద్దు. దీనిపై పోలీసులు సమగ్ర దర్యాప్తు చేసి నిజానిజాలు ప్రజలకు వెల్లడించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.