3500 మంది కానిస్టేబుళ్లకు పదోన్నతులు
వరంగల్ టైమ్స్, హైదరాబాద్ : రాష్ట్రంలో త్వరలోనే 3500 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా పదోన్నతి లభించనుంది. యూనిట్ల వారీగా కానిస్టేబుళ్ల సీనియారిటీ జాబితాలను పోలీస్ ఉన్నతాధికారులు ప్రస్తుతం రూపొందిస్తున్నారు. వారం రోజుల్లో పదోన్నతులకు సంబంధించిన ఉత్తర్వులు వెలువడనున్నాయి. రాష్ట్రంలో గడచిన నాలుగేళ్లుగా కానిస్టేబుళ్ల పదోన్నతులు పెండింగ్లో ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్సెస్ (ఏఆర్), తెలంగాణ స్టేట్ స్పెషల్ పోలీస్ (టీఎ్సఎస్పీ) విభాగాల నుంచి సివిల్ విభాగంలోకి వచ్చిన తమకు పదోన్నతుల విషయంలో పాత సీనియారిటీని పరిగణనలోకి తీసుకోవడం లేదంటూ 2018లో కొందరు కానిస్టేబుళ్లు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 3500 మంది కానిస్టేబుళ్లకు హెడ్ కానిస్టేబుళ్లుగా త్వరలోనే పదోన్నతులు కల్పిస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.