లతా మంగేష్కర్‌ మృతికి రాజ్యసభ నివాళులు

వరంగల్ టైమ్స్,ఢిల్లీ: ప్రముఖ గాయని లతా మంగేష్కర్‌ మృతికి రాజ్యసభ నివాళులర్పించింది. ఉదయం 10 గంటలకు రాజ్యసభ ప్రారంభం కాగానే చైర్మన్‌ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివారు. ‘‘లతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమ మరణం ఓ శకానికి ముగింపు.

సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎన్నటికీ పూడ్చలేనిది’’అని ఛైర్మన్‌ వెంకయ్యనాయుడు సంతాపం తెలియజేశారు. ఆ తర్వాత సభ్యులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. లత గౌరవార్థం సభను గంట పాటు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. అటు సాయంత్రం లోక్‌సభ కూడా లతాజీకి నివాళులర్పించి గంట పాటు సభను వాయిదా వేయనుంది.

ఏడు దశాబ్దాల పాటు తన గాన మాధుర్యంతో సంగీత ప్రియులను ఓలలాడించిన లతా మంగేష్కర్‌ ఆదివారం దివికేగారు. కొంతకాలం నుంచి కరోనాతో పాటు న్యుమోనియాతో పోరాడుతున్న ఆమె నిన్న తుదిశ్వాస విడిచారు. ఆమె మృతితో సంగీత లోకం శోకసముద్రంలో మునిగిపోయింది. ఆమె అంతిమ యాత్రకు వేలాది మంది తరలివచ్చి అశ్రు నివాళులు అర్పించి తుది వీడ్కోలు పలికారు.