హైదరాబాద్ : సీఎం కేసీఆర్ ఫాంహౌజ్ వద్దకు వెళ్తానంటూ బయల్దేరేందుకు యత్నించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్ పోలీసులు సోమవారం అడ్డుకుని అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. సోమవారం ఉదయం నుంచి జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని రేవంత్ నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఎ
లాంటి అనుమతులు లేకుండా ఎర్రవెల్లికి వెళ్లేందుకు రావాలంటూ రేవంత్ కోరడంతో భారీగా కార్యకర్తలు జూబ్లీహిల్స్ కు వచ్చారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు.
వెస్ట్ జోన్ ఇన్ చార్జి డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ తో పాటు ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మొహరించారు. కావాలంటే గాంధీభవన్ కు వెళ్లడానికి అనుమతి ఇస్తామని పోలీసులు చెప్పినా పట్టించుకోని రేవంత్ రెడ్డి భారీగా వచ్చిన కార్యకర్తలతో కలిసి ఇంట్లోంచి బయటకు వచ్చారు. రేవంత్ రెడ్డి ఎలాగైనా గజ్వేల్ వెళ్తానంటూ కార్యకర్తలతో కలిసి ముందుకు దూసుకువెళ్లేందుకు ప్రయత్నించాడు. దీంతో పోలీసులు అప్రమత్తమై రేవంత్ రెడ్డిని అదుపులోకి తీసుకుని అంబర్ పేట స్టేషన్ కు తరలించారు.