సబిత ఇంద్రారెడ్డికి ఎదురుగాలి?
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి: మంత్రి సబితా ఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున గెలిచారామె. టీఆర్ఎస్ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై విజయం సాధించారు.ఆ తర్వాత సబితా ఇంద్రారెడ్డి కారెక్కారు. అనంతరం మహేశ్వరంలో పరిస్థితులు మారిపోయాయి. కేంద్రంలో మోదీ అధికారంలో ఉండడం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్ నియామకంతో ఇక్కడ బీజేపీ శ్రేణులు బాగా యాక్టివ్ అయిపోయారు. ఒకప్పుడు మూడోస్థానంలో నిలిచిన బీజేపీ ఇప్పుడు బీఆర్ఎస్ కు సరైన ప్రత్యామ్నాయం అనేలా పరిస్థితి మారింది.
మహేశ్వరం నియోజకవర్గానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి నాన్ లోకల్. దీంతో బీజేపీ శ్రేణులు సబితను ఇబ్బంది పెట్టేందుకు లోకల్ అంశాన్ని తెరపైకి తెస్తున్నారు. నాన్ లోకల్ అభ్యర్థులతో నియోజకవర్గ అభివృద్ధి ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. సబిత మాత్రం ఇవన్నీ పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు. అయితే మహేశ్వరంలో వాస్తవ పరిస్థితి మాత్రం ఆమెకు కొంత వ్యతిరేకంగా ఉందన్న వాదన బలంగా వినిపిస్తోంది.
సబితా ఇంద్రారెడ్డి వేరే పార్టీలో గెలిచి, గులాబీ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వడంతో చాలామంది కాంగ్రెస్ శ్రేణులు ఆమెపై గుర్రుగా ఉన్నారట. అంతేకాదు వారంతా పరోక్షంగా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారన్న అనుమానాలున్నాయి. దాని ఫలితంగానే మహేశ్వరం నియోజకవర్గంలో కీలకంగా ఉన్న తుక్కుగూడ మున్సిపాలిటీలో బీజేపీ సత్తా చాటింది. కాంగ్రెస్ నేతల సహకారంతోనే తుక్కుగూడ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చాయన్న వాదన ఉంది.చివరకు ఎక్స్ అఫిషియో ఓటుతో మున్సిపల్ ఛైర్మన్ పదవి టీఆర్ఎస్ వశమైనా అది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికైన మధుమోహన్, సబితా ఇంద్రారెడ్డికి షాకిచ్చారు. గులాబీ పార్టీలో ఉండలేనంటూ బీజేపీ గూటికి చేరారు. స్వయంగా మున్సిపల్ ఛైర్మన్ అధికార పార్టీని వదిలి బీజేపీకి చేరడం.. నియోజకవర్గంలో కమలం పార్టీ పునాదులు ఎంత బలంగా ఉన్నాయో చెప్పకనే చెప్పినట్లయ్యియింది.
మహేశ్వరంలో బీజేపీ రోజురోజుకు బలపడుతుంటే , బీఆర్ఎస్ పరిస్థితి రోజురోజుకు తీసికట్టుగా మారుతోంది. బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గంలో కీలకంగా ఉన్న తుక్కుగూడ, జల్ పల్లి, మహేశ్వరంలో స్థానిక ప్రజాప్రతినిధుల మధ్య సఖ్యత లేదు. సబితా ఇంద్రారెడ్డి మంత్రిగా ఉన్నా నియోజకవర్గానికి పెద్దగా చేసిందేమీ లేదన్న విమర్శలు కూడా ఉన్నాయి. దాని ఫలితంగానే ఈసారి ఆమెకు ఎదురుగాలి తప్పదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
బీజేపీ నుంచి శ్రీరాములు యాదవ్, మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ పేర్లు వినిపిస్తున్నాయి. దేవేందర్ గౌడ్ సొంతూరు తుక్కుగూడ కావడంతో ఆయనకు ఇక్కడి నేతలతో పార్టీలకతీతంగా మంచి సంబంధాలున్నాయి. దీంతో వీరేందర్ గౌడ్ కు మహేశ్వరం టికెట్ వచ్చే అవకాశముందని ప్రచారం జరుగుతోంది. శ్రీరాములు యాదవ్ కూడా బీసీ అభ్యర్థే కావడంతో ఆయన కూడా టికెట్ రేసులో ఉన్నారని టాక్. బీజేపీ అధిష్టానం మాత్రం అభ్యర్థి ఎవరన్నది ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.
మహేశ్వరం నియోజకవర్గంలో వాస్తవ పరిస్థితిపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చారట. సర్వే కూడా చేయించుకున్నట్లు టాక్. సర్వే ఫలితాలు ఆమెకు వ్యతిరేకంగా వచ్చినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. అందుకే మహేశ్వరంను వదిలి వేరే నియోజకవర్గానికి వెళ్లే ప్రయత్నాల్లో సబిత ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. రాజేంద్రనగర్ సీటుపై సబితా ఇంద్రారెడ్డి కర్చీఫ్ వేశారని కూడా గులాబీశ్రేణులు గుసగుసలాడుకుంటున్నారు. మరి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నుంచే పోటీ చేస్తారా? లేక వేరే నియోజకవర్గం చూసుకుంటారా? అన్నది మాత్రం క్లారిటీ లేదు. ఎన్నికలు వస్తేనే గానీ ఆ క్లారిటీ వచ్చే అవకాశమైతే కనిపించడం లేదు.