హైదరాబాద్ : సింగరేణిలో ఆరేళ్ల బాలికపై జరిగిన హత్యాచారం కేసులో తెలంగాణ ఆర్టీసీ అలర్ట్ అయింది. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు. సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై హత్యాచారం కేసులో నిందితుడి కోసం తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ రంగంలోకి దిగారు. నిందితుడిని గుర్తించేందుకు ఆర్టీసీ బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సజ్జనార్ ఆర్టీసీ సిబ్బందికి సూచించారు. నిందితుడిని గుర్తిస్తే వెంటనే 9390616366, 9490616627 నెంబర్లకు కాల్ చేయాలన్నారు. దాంతో ఆర్టీసీ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. నిందితుడు మద్యం మత్తుల్లో బస్టాండ్లలో నిద్రపోయే అవకాశం ఉందని తెలిపారు.
ఇలాంటి కేసులను చేధించడంలో ఐపీఎస్ సజ్జనార్‌కు మంచి గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్న ఆయన నిందితుడిని గాలించేందుకు తెలంగాణ ఆర్టీసీని అలర్ట్ చేశారు. బస్ స్టేషన్లు, బస్సుల్లో అప్రమత్తంగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఆర్టీసీ బస్సుల్లోనే నిందితుడు ప్రయాణించే అవకాశం ఉందని, ప్రతి బస్సులో, బస్లాండ్లలో నిందితుడి ఫొటోను పెట్టాలని ఆదేశించారు. ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లతో పాటు సిబ్బంది అంతా అలర్ట్ గా ఉండాలని సూచించారు. నిందితుడు రాజు కదలికలు ఉన్నట్టుగా ఏమాత్రం అనుమానం వచ్చినా వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. 94906 16366, 94906 16627 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలన్నారు.
హైదరాబాద్ నగరంలోని సైదాబాద్ సింగరేణి కాలనీలో ఆరేళ్ల పాపపై ఆటో డ్రైవర్ రాజు (30) హత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిపై అత్యాచారం చేసి ఆపై కిరాతకంగా చంపేశాడు. పసిపాపను దారుణంగా హత్యచేసిన నిందితుడిని గుర్తించి అప్పగించేంతవరకు పాప మృతదేహాన్ని కదిలించేది లేదంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. సింగరేణి కాలనీలో అదృశ్యమైన బాలిక ఆచూకీ కోసం తల్లిదండ్రులు చుట్టుపక్కల గాలించారు. పాప ఆచూకీ తెలియకపోవడంతో ఆటో రాజుపై అనుమానం వచ్చింది. ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్న రాజు చిల్లర దొంగతనాలు చేస్తుండేవాడు. జనాలతో దురుసుగా ప్రవర్తించేవాడు. అతడే పాపను ఏమైనా చేశాడమేననే అనుమానంతో అర్థరాత్రి అతడి ఇంటి తలుపులు పగలగొట్టి చూశారు.
వారి అనుమానమే నిజమైంది. చిన్నారి ప్రాణాలు కోల్పోయి విగతజీవిలా పడి ఉంది. ఆడుకుంటూ కేరింతలు కొట్టిన చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. తమ పాపను దారుణంగా హత్యాచారం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. రోజులు గడుస్తున్నా నిందితుడి గురించి ఎలాంటి క్లూస్ కూడా దొరకలేదు. దాంతో నిందితుడిని గుర్తించి సమాచారం అందిస్తే వారికి 10లక్షల రివార్డు ఇస్తామంటూ రాజు ఫోటోను పోలీసులు విడుదల చేశారు.