సాలిగ్రామాలలతో శ్రీరాముడు సీత విగ్రహాలు..!
*అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామ శిలలు
*సాలిగ్రామ శిలలతో సీతమ్మ, శ్రీరాముడి విగ్రహాలు
*నేపాల్ నుంచి అయోధ్యకు చేరుకున్న సాలిగ్రామాలు
*ఆరు కోట్ల యేళ్ల నాటి సాలిగ్రామాలు
*పూజల అనంతరం దేవతా విగ్రహాలుగా మారనున్న సాలిగ్రామాలు
వరంగల్ టైమ్స్, డెవోషనల్ డెస్క్ : అయోధ్యలో రామమందిరం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. శ్రీరాముడు, సీత విగ్రహాలను తయారు చేసేందుకు సాలిగ్రామ శిలలు నేపాల్ నుంచి అయోధ్యకు చేరుకున్నాయి. శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ సాలిగ్రామ శిలలకు ప్రత్యేకంగా పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. నేపాల్ గండకీ నుంచి ఈ శిలలు అయోధ్యకు చేరుకున్నాయి. రెండు ట్రక్కుల్లో 30 టన్నుల బరువైన రెండు సాలిగ్రామ రాతిఫలకాలను అయోధ్యకు తీసుకువచ్చారు ట్రస్టు సభ్యులు. ఈ భారీ శిలలకు పూజలు నిర్వహిస్తున్నారు. పూజల అనంతరం విగ్రహాలను తయారు చేస్తారు. సాలిగ్రామ శిలలు ఆరు కోట్ల ఏళ్ల నాటివని భక్తులు అంటున్నారు. నేపాల్ నుంచి అయోధ్యకు తీసుకువచ్చే మార్గంలో ఈ శిలలకు భక్తులు భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు.
శ్రీ మహా విష్ణువు అవతారంగా సాలిగ్రామ శిలలను హిందువులు పూజిస్తారు. నేపాల్లోని కాలీ గండకీ నది పరిసరాల్లో మాత్రమే ఈ సాలిగ్రామ శిలలు లభిస్తాయి. హిమాలయాల నుంచి పారే ఈ నది భారీ శిలలను చీల్చుకుంటూ ప్రవహిస్తుండటంతో అక్కడ 33 రకాల శిలాజాలతో ఈ శాలిగ్రామ శిలలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. 2024కు ముందే శాలిగ్రామ శిలతో అయోధ్య రాముడి విగ్రహం రెడీ అవుతోంది. అయోధ్య రామమందిరంలో సీతాదేవి విగ్రహాన్ని కూడా శాలిగ్రామ శిలతో తయారు చేస్తుండటం విశేషం. ఈ రెండు విగ్రహాల తయారీ తర్వాత గర్భగడిలో ప్రతిష్టించనున్నారు. 2024 జనవరి 1న రామాలయ ప్రారంభోత్సం జరుగుతుందని కేంద్ర హోం శాఖ మంత్రి తెలిపిన సంగతి తెలిసిందే.