నోరుజారిన బండి సంజయ్..డిఫెన్స్ లో బీజేపీ !
వరంగల్ టైమ్స్, టాప్ స్టోరి : తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈడీ విచారణకు పిలిచింది. ఈ వార్తతో గులాబీదళంలో అలజడి రేగింది. కవిత ఇష్యూపై ముందు అంతగా క్లారిటీ లేకపోవడంతో ఏం మాట్లాడాలో తెలియక గులాబీ నేతలు కూడా కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు. సరిగ్గా అదే సమయంలో బండి సంజయ్ నోరు జారారు. కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసి, గులాబీ పార్టీకి సరైన సమయంలో అస్త్రాన్ని అందించారు. ఇక్కడే గులాబీదళం పక్కా స్ట్రాటజీ వేసింది. కవితపై బండి వ్యాఖ్యలను నిరసిస్తూ ధర్నాలకు తెరతీశారు గులాబీశ్రేణులు.
* బండి సంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్
తెలంగాణలో మహిళల టాపిక్ వస్తే చాలా పద్ధతి, గౌరవంగా మాట్లాడతారు. మన కల్చర్ అంత గొప్పది. ముఖ్యంగా తెలంగాణ పాలిటిక్స్ లో పార్టీలకతీతంగా ఇదే సంప్రదాయం ఉంది. కానీ బండి సంజయ్ మాత్రం కవితపై వెటకారంగా మాట్లాడబోయి అడ్డంగా బుక్కయ్యారు. ఒకటి అనబోయి ఇంకోటి అనేశారు. వాస్తవానికి కవితను ఈడీ పిలిస్తే పెద్ద ఎత్తున చర్చ జరగాలి. కానీ ఇక్కడే బీఆర్ఎస్ ప్లాన్ వర్కవుట్ అయ్యింది. బండి సంజయ్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణ వ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు హోరెత్తాయి. ఓ మహిళా నాయకురాలిని బండి సంజయ్ అంత మాట అనడం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమైంది.* మహిళా సెంటిమెంటుతో కొట్టిన గులాబీ పార్టీ
రాష్ట్ర బీజేపీ చీఫ్ గా ఉన్న బండి సంజయ్ కేసీఆర్ ను టార్గెట్ చేసి మాట్లాడితే ఏం కాదు. కానీ మహిళా నాయకురాలి గురించి మాట్లాడినప్పుడు నోరు అదుపులో పెట్టుకోవాలి. లేనిపక్షంలో విమర్శలు శృతిమించి అసలుకే ఎసరొచ్చే ప్రమాదం ఉంది. కవిత విషయంలోనూ అదే జరిగింది. ఈడీ విచారణ హైలైట్ అవుతుందని అనుకుంటే, చివరకు బండి సంజయ్ కామెంట్స్ హైలైట్ అయ్యాయి. బండి వ్యాఖ్యలపై యావత్ తెలంగాణలో ధర్నాలు , నిరసనలు మిన్నంటాయి. ఊరూరా బండి సంజయ్ దిష్టిబొమ్మల దహనం జరిగింది. మహిళా సెంటిమెంటును ప్రయోగించి బీజేపీని డిఫెన్స్ లోకి నెట్టేందుకు గులాబీ పార్టీ గట్టి ప్రయత్నమే చేసింది.* సొంతపార్టీలోనూ బండి మాటలపై వ్యతిరేకత ?
బీఆర్ఎస్ నేతల సంగతేంటో కానీ, చివరకు బీజేపీ శ్రేణులు కూడా బండి సంజయ్ తీరుపై అసహనంగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. కీలక సమయంలో ఇలా నోరు జారడం సరికాదని కాషాయం నేతలు కూడా బండికి సూచించినట్లు తెలుస్తోంది. ఢిల్లీ పెద్దలు కూడా బండికి ఫోన్ చేసినట్లు టాక్. కవిత ఇష్యూ గురించి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారట. ఇలాంటి తరుణంలో ఆచితూచి మాట్లాడ్డం నేర్చుకోవాలని గట్టిగానే చెప్పినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు హోరెత్తుతుంటే బీజేపీ క్యాడర్ కౌంటర్ ఇవ్వలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.
మొత్తానికి ఈడీ విచారణకు కవిత హాజరుకావడం, దాదాపు 8 గంటలకు పైగా ఈడీ ప్రశ్నించడం, మళ్లీ ఈనెల 16న రావాలని చెప్పడం ఇవన్నీ జరిగినా గులాబీ పార్టీ మాత్రం చాలా తెలివిగా బీజేపీని కార్నర్ చేసింది. బండి సంజయ్ కామెంట్స్ నే ఉటంకిస్తూ బీజేపీకి స్ట్రాంగ్ కౌంటరిచ్చింది. బండి వ్యాఖ్యలను జనంలోకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. సక్సెస్ అయ్యింది. అందుకే అంటారు రాజకీయాల్లో నోరు అదుపులో ఉండాలి అని. బండి సంజయ్ నోటినుంచి వచ్చిన ఒక్కమాట ఆ పార్టీని డిఫెన్స్ లో నెట్టేసింది. అందుకే ఎప్పుడూ గట్టి కౌంటరిచ్చే కాషాయం శ్రేణులు కూడా చేతులెత్తేసి ఏం చేయలేక పోయారన్న వాదన వినిపిస్తోంది.!