హైదరాబాద్ : తెలంగాణ హైకోర్టుకు జనవరి 10 నుంచి సంక్రాంతి సెలవులు ప్రకటించారు. 13న భోగి, 14న సంక్రాంతి, 15న కనుమ పండుగల సందర్భంగా హైకోర్టు పనిచేయదు. ఈనెల 8న శనివారం, 9న ఆదివారం, 16న ఆదివారం కలిపి 9 రోజుల వరుస సెలవుల తర్వాత జనవరి 17న తిరిగి హైకోర్టు ప్రారంభం అవుతుంది. అయితే వెకేషన్ కోర్టు మాత్రం ఈ నెల 12న పనిచేస్తుంది.
ఎమర్జెన్సీ కేసులను ఈ నెల 10న దాఖలు చేసుకోవచ్చు. 12న న్యాయమూర్తులు జస్టిస్ బి.విజయ్ సేన్ రెడ్డి, జస్టిస్ ఎన్.తుకారాంజీతో కూడిన ద్విసభ్య ధర్మాసనం , న్యాయమూర్తి జస్టిస్ పి.మాధవీదేవి అధ్యక్షతన ఏకసభ్య ధర్మాసనం అత్యవసర కేసులను విచారిస్తాయని రిజిస్ట్రార్ జనరల్ పేరిట నోటిఫికేసన్ వెలువడింది.
ముందస్తు బెయిల్ పిటిషన్లు,హెబియస్ కార్పస్, కింది కోర్టులు బెయిల్ మంజూరుకు నిరాకరించడాన్ని సవాల్ చేసిన పిటిషన్లు, అత్యవసర వ్యాజ్యాలను మాత్రమే వెకేషన్ కోర్టులు విచారణ చేస్తాయి. కరోనా వైరస్ తీవ్రత పెరిగిన దృష్ట్యా చాలా అత్యవసరమైతేనే సంక్రాంతి పండుగల్లో కేసులు వేయాలని ధర్మాసనం పైనే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీష్ చంద్ర శర్మ పిటిషనర్లకు విజ్ఞప్తి చేశారు.