శ్రీవారి సర్వదర్శన టోకెన్ల నిలిపివేత

తిరుపతి : తిరుపతిలో శ్రీవారి సర్వదర్శన టోకెన్లను టీటీడీ అధికారులు ఆదివారం రాత్రి నుంచి తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ నెల 24 వ తేదీవరకు సర్వదర్శనం టోకెన్లను భక్తులకు అందజేశారు. అయితే నిన్న రాత్రికే టోకెన్లు పూర్తి కావడంతో నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. 24వ తేదీ నుంచి జనవరి 3 వరకు స్థానికులకు మాత్రమే వైకుంఠ ఏకాదశి దర్శనం టోకెన్లను అందించనున్నట్లు వెల్లడించారు. ప్రతిరోజు ఎనిమిదివేల మందికి మాత్రమే టోకెన్ల అందించనున్నట్లు ప్రకటించారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఆధార్​కార్డుతో రావాలని సూచించారు. స్థానికేతరులు టోకెన్ల కోసం రావద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని టీటీడీ అధికారులు కోరారు.