జయశంకర్ భూపాలపల్లి జిల్లా: బొగ్గు గనుల ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల పిలుపుమేరకు జయశంకర్ భూపాలపల్లిలోని సింగరేణి గనుల్లో రెండో రోజు సమ్మె కొనసాగింది. భూపాలపల్లి డివిజన్ లోని సింగరేణి గనుల్లో పనిచేసే 6800 మంది కార్మికులు విధులకు హాజరుకాకుండా స్వచ్ఛంధంగా బంద్ పాటించి నిరసన వ్యక్తం చేశారు. సమ్మె ప్రభావంతో సుమారు 7 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోగా , సింగరేణి సంస్థకు 3 కోట్ల మేర ఆస్తి నష్టం వాటిల్లింది. సింగరేణి కార్మికుల సమ్మె కొనసాగుతున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డిఎస్పీ సంపత్ రావు, సిఐ వాసుదేవరావు ఆధ్వర్యంలో బొగ్గు గనులపై పోలీసులు బందోబస్తు నిర్వహించారు.