నిజామాబాద్ జిల్లా : వంద శాతం సబ్సిడీతో రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేస్తున్న ఉచిత చేప విత్తనం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ రోజు బాన్సువాడ కల్కి చెరువులో చేప పిల్లలను విడుదల చేశాడు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ జితీష్, వి. పాటిల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, మత్స్యకారులు పాల్గొన్నారు.
100 శాతం సబ్సిడీతో చేప పిల్లలను మత్స్యకారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఏ ప్రభుత్వం, ఏ సీఎం ఇవ్వలేదని స్పీకర్ అన్నారు. గతంలో ఏదో నామ్ కే వాస్తేగా జిల్లాలో కొన్ని చెరువులకు ఒక్కోదానికి రూ.12,500 చొప్పున ఇచ్చేవారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు, చెరువులు, సాగునీటి వనరులలో రూ. 92 కోట్లతో 100 కోట్ల చేప పిల్లలను ఏటా విడుదల చేస్తుంది.
వీటి విలువ ఏడాదికి పదివేల కోట్ల రూపాయలు అని పేర్కొన్నారు. కుల వృత్తుల వారు గౌరవ ప్రదంగా బతకడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీలతో పథకాలను అమలు చేస్తుందని ఈ సందర్భంగా స్పీకర్ తెలిపారు.