వరంగల్ టైమ్స్, ములుగు జిల్లా : మేడారం మహాజాతరను పురస్కరించుకుని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య నేడు కలెక్టరేట్ లో అధికారిక వెబ్ సైట్ www.medaramjathara.comను ప్రారంభించారు. అదే విధంగా మొబైల్ యాప్ ను ఆవిష్కరించారు. ఈనెల 16 నుంచి 19 వరకు సమ్మక్క, సారలమ్మల జాతర జరుగనుంది. ఈ వెబ్ సైట్, ఆండ్రాయిడ్ యాప్ ద్వారా భక్తులకు త్రాగునీరు, మేడారం జాతర రూట్ మ్యాప్, జాతరలో తప్పిపోయిన వారి ఆచూకీ తెలుసుకునే పాయింట్లు, ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల వివరాలు, దర్శనం క్యూలైన్, పార్కింగ్ ప్లేస్, కొవిడ్ వ్యాక్సిన్స్ అందించే పాయింట్లు, మెడికల్ క్యాంపులు, టాయిలెట్స్ , జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు తదితర వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ఉంటుందని కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య పేర్కొన్నారు.
ప్రత్యేక వెబ్ సైట్, యాప్ ద్వారా భక్తులు తమ అభిప్రాయాలు, సూచనలు ఇవ్వవచ్చని తెలిపారు. అంతేకాకుండా జాతరను ప్రత్యక్షప్రసారం ద్వారా వీక్షించే అవకాశం ఉందని వెల్లడించారు. ఈ వెబ్ సైట్ లో ట్రాఫిక్ మార్గదర్శకాలతో పాటు, సహాయ కేంద్రాలు, ఆర్టీసీ బస్సులు బయలుదేరు సమయాలు, ఛార్జీల వివరాలు, స్టేజీల సమాచారంతో పాటు అమ్మవారికి సమర్పించే నిలువెత్తు బంగారం ( బెల్లం) ధర వివరాలు పొందుపరిచినట్లు తెలిపారు. ఈ యాప్ అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంటుందని వివరించారు. ఈ యాప్ ను ప్లేస్టోర్ లో మేడారం జాతర గైడ్ అఫీషియల్ అని టైప్ చేసి డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేడారం జాతర ఇంఛార్జ్ డీసీపీ గౌస్ ఆలం, ఏఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కె కన్, కలెక్టరేట్ ఏవో విజయ భఆస్కర్, డీపీఆర్వో బి.ప్రేమలత, తదితరులు పాల్గొన్నారు.