శ్రీభాష్యం విజయసారథి మృతి..ప్రముఖుల నివాళులు
వరంగల్ టైమ్స్, కరీంనగర్ జిల్లా : సుప్రసిద్ధ సంస్కృత భాషా పండితుడు, కరీంనగర్ ముద్దు బిడ్డ పద్మశ్రీ శ్రీభాష్యం విజయసారథి (87) మృతి చెందారు. అలకపురిలోని నివాసంలో బుధవారం ఉదయం ఆయన తుది శ్వాస విడిచారు. సంస్కృత భాషా పండితుడు, ప్రతిభ, పరిశోధన, విశ్లేషణ, వ్యాఖ్యాన రీతుల్లో దేశవ్యాప్తంగా ఖ్యాతి పొందిన కవి శ్రీభాష్యం విజయసారథి. ఎన్నో ఉన్నతమైన రచనలు చేసి వ్యాఖ్యానమూర్తిగా పేరొందారు. ఆయన అమర భాషలో ఆధునికుడు. ఆయనకు తెలంగాణ సంస్కృత వాచస్పతిగా పేరుంది. వీరి సాహత్య కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం 2020 లో పద్మశ్రీ పురస్కారానికి ఎంపిక చేసింది.విజయసారథి మృతికి సీఎం కేసీఆర్ సంతాపం..
శ్రీ భాష్యం విజయ సారథి మృతి చెందడం పట్ల తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వారి మరణం దేశ సంస్కృత భాషా పాండిత్యానికి తీరని లోటని అన్నారు. ఈ సందర్భంగా శ్రీభాష్యం సాహితీ సేవను సీఎం కేసీఆర్ స్మరించుకున్నారు. కవిత్వ సృజనతో పాటు, రాగయుక్తంగా కవిత్వాలాపన చేయడంలో శ్రీభాష్యం గొప్ప ప్రతిభను ప్రదర్శించేవారని అన్నారు. వర్తమాన కవులకు ఆయన జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
విజయసారథి మృతికి బోయినపల్లి దిగ్భ్రాంతి..
శ్రీ భాష్యం విజయ సారథి మృతి చెందడం పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకొని వెళ్లి సంస్కృత భాష అభివృద్ధి కోసం విజయ సారథి ఎనలేని కృషి చేశారని బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. వరంగల్, కరీంనగర్ జిల్లాల్లో వివిధ విద్యా సంస్థల నిర్వహణలో క్రియాశీలక పాత్ర పోషించిన మహా వ్యక్తి విజయ సారథి అని కొనియాడారు. కరీంనగర్ లోని యజ్ఞ వరహా స్వామి ఆలయ ట్రస్టీగా విశేష కృషి జపారని గుర్తుచేశారు. శ్రీ భాష్యం విజయసారథి మృతి రాష్ట్రానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతూ మనోధర్యంతో ఉండాలని కోరుకున్నారు.