హైదరాబాద్ : సమంత ప్రధాన పాత్రలో శ్రీదేవి మూవీస్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 14గా శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘యశోద’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. హరి – హరీష్… ఇద్దరు యువకులు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయం అవుతున్నారు. పూజా కార్యక్రమాలతో ఇటీవల సినిమా చిత్రీకరణ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో కీలకమైన పాత్రలో నటి వరలక్ష్మీ శరత్ కుమార్ నటించనున్నారు.
నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మేం నిర్మిస్తున్న బహు భాషా చిత్రం ‘యశోద’ చిత్రీకరణ ఈ నెల 6న ప్రారంభమైంది. అప్పటి నుంచి నిర్విరామంగా షూటింగ్ జరుగుతోంది. సినిమాలో కీలకమైన మధుబాల పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపిస్తారు.
నేటి నుంచి ఆమె చిత్రీకరణలో పాల్గొంటారు. ప్రధాన తారాగణంపై ఈ నెల 23 వరకూ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తొలి షెడ్యూల్ చేస్తాం. జనవరి 3 నుంచి రెండో షెడ్యూల్ మొదలవుతుంది. నిర్విరామంగా చిత్రీకరణ చేసి… మార్చికి సినిమాను పూర్తి చేస్తాం. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరింది” అని చెప్పారు.
సమంత ప్రధాన పాత్రలో, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్. సెంథిల్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: రషీద్ అహ్మద్ ఖాన్, రామాంజనేయులు, ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, కెమెరా: ఎం. సుకుమార్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబర్ జాస్తి, సంగీతం: మణిశర్మ, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.