జాతీయస్థాయిలో ప్రథమస్థానాన్ని కైవసం చేసుకున్న సుప్రజ నెరవేరిన రంగుల కళ
జనగాం జిల్లా: జాతీయ స్థాయిలో నిర్వహించిన ఆన్ లైన్ రంగోలి పోటీల్లో ప్రథమ స్థానం కైవసం చేసుకుని బంగారు పథకం సాధించింది జనగామజిల్లా గుండ్లగడ్డకు చెందిన తంగెళ్ళపల్లి సుప్రజ. అహ్మదాబాద్ కు చెందిన సంస్కార్ భారత్ రంగోలి ఆర్టిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో ఆన్ లైన్ రంగోలి పోటీలను మే 25న మూడు విభాగాల్లో నిర్వహించారు. మొదటి విభాగం వినాయక చవితి, రెండవ విభాగం కరోనా వైరస్ పై యుద్ధం, మూడవ విభాగం ఫ్రీడమ్ ఫైటర్స్ మీద పోటీలు నిర్వహించగా సుప్రజ మాత్రం రెండవ విభాగం కరోనా వైరస్ పై యుద్ధం అనే అంశాన్ని ఎంచుకుని రంగోలి వేసింది. ఈ పోటీల్లో 20 రాష్ట్రాల నుంచి 200మంది రంగోలి కళాకారులు పాల్గొనగా, జూన్ 10న సెమీఫైనల్స్ లో 25మందిని ఎంపిక చేశారు. జూన్ 15న ఫైనల్స్ ఫలితాలను ప్రకటించింది. ఈ ప్రకటనలో తంగెళ్ళపల్లి శ్రీవాణి- నాగేశ్వర్ రావుల కూతురు సుప్రజ మొదటిస్థానంలో నిలిచి బంగారుపథకాన్ని సాధించింది. ఎంటెక్ విధ్యనభ్యసించిన తాను హైదరాబాద్ లో ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉన్నతమైన ఉద్యోగం చేసినప్పటికీ ఇంకా ఏదైనా సాధించాలన్న తపనతోనే రంగోలి కళను ఎంచుకుంది సుప్రజ. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సమాజంలో జరిగే ప్రతీ అంశాన్ని తన రంగోలి కళతో సమాజానికి ఒక చైతన్యవంతమైన సందేశాన్ని అందిస్తుంటుంది. ఇలా ఎన్నోసార్లు జిల్లా స్థాయిలో అవార్డులు అందుకున్న సుప్రజ ఇప్పుడు జాతీయస్థాయిలో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుని బంగారు పథకం సాధించడం అదృష్టంగా భావిస్తున్నానంటుంది తంగెళ్ళపల్లి సుప్రజ. విద్యావంతులు, గురువులైన తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లే ఈ అవార్డును సాధించానని గర్వంగా చెబుతుంది.
తన రంగోలి కళతో జాతీయస్థాయిలో బంగారు పథకాన్ని సాధించి జనగామజిల్లాకు పేరు ప్రఖ్యాతలు తెచ్చిన సుప్రజను స్థానికులు అభినందించారు. ఇక తన ప్రతిభను ఆన్ లైన్ ఫేస్ బుక్ ద్వారా లైక్ లు చేస్తూ సోషల్ మీడియాలో తనను ప్రోత్సహించిన ప్రతీ ఒక్కరికి రంగోలి గోల్డ్ మెడలిస్ట్ సుప్రజ కృతజ్ఞతలు తెలుపుతోంది.