సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో స్లో ఓవర్ రేట్ కారణంగా టీం ఇండియా ప్లేయర్స్‌కు జరిమానా విధించారు. ఒక్కో ప్లేయర్ మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత పడే అవకాశంవుంది. దీనిపై అధికారికంగా విచారణ జరపాల్సిన అవసరం లేదని, కెప్టెన్ విరాట్ కోహ్లి తన తప్పును ఒప్పుకున్నాడని శనివారం ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది. టీమిండియా నిర్ణీత సమయంలో ఒక ఓవర్ తక్కువగా వేసింది. దీంతో ఐసీసీ మ్యాచ్ రిఫరీల ఎలైట్ ప్యానెల్‌కు చెందిన డేవిడ్ బూన్ ఈ జరిమానా విధించినట్లు ఐసీసీ ఆ ప్రకటనలో వెల్లడించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.22 ప్రకారం ఒక టీమ్ తక్కువగా వేసే ప్రతి ఓవర్‌కు మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత విధిస్తారు. తొలి వన్డేలో 66 పరుగులతో పరాజయం పాలైన కోహ్లి సేన అదే వేదికలో ఆదివారం రెండో వన్డే మ్యాచ్ కోసం సిద్ధమవుతోంది.