వరంగల్ టైమ్స్, స్పోర్ట్స్ డెస్క్: సఫారీ గడ్డపై నిరాశాజనక ప్రదర్శన అనంతరం స్వదేశంలో వెస్టిండీస్ ను చిత్తు కింద కొట్టిన టీం ఇండియా, శ్రీలంకపై కూడా అదే జోరు కొనసాగించింది. మూడు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా గురువారం జరిగిన తొలి టీ20లో రోహిత్ సేన 62 పరుగుల తేడాతో లంకపై విజయం సాధించింది. పొట్టి ఫార్మాట్ లో ఇండియా జట్టుకు ఇది వరుసగా 10వ విజయం కావడం విశేషం. ఫలితంగా 3 మ్యాచ్ ల సిరీస్ లో 1-0 తో ముందడుగు వేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీంఇండియా 2 వికెట్ల నష్టానికి 199 రన్స్ చేసింది.
వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ( 56 బంతుల్లో 89 ; 10ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (28 బంతుల్లో, 57 నాటౌట్ ; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ శతకాలతో ఆకట్టుకోగా, కెప్టెన్ రోమిత్ శర్మ (44 ; 2 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించాడు. లంక బౌలర్లలో దనుస్ షనక, లహిరు కుమార చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన లంక 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు చేసింది.
భారీ ఛేజింగ్ లో భారత్ కు ఏ మాత్రం పోటీనివ్వలేకపోవడంతో మ్యాచ్ పూర్తి ఏకపక్షంగా సాగింది. చరిత అసలెంక ( 53 నాటౌట్) టాప్ స్కోరర్ కాగా, భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, వెంకటేశ్ అయ్యర్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. విధ్వంసక ఇన్నింగ్స్ తో విరుచుకుపడ్డ ఇషాన్ కిషన్ కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శనివారం ధర్మశాలలో జరుగనుంది.