కారు పేలుడులో హతమైన ఉగ్రవాది
వరంగల్ టైమ్స్, క్రైం డెస్క్ : తమిళనాడు కోయంబత్తూరు పేలుడులో చనిపోయిన తీవ్రవాది.. దక్షిణ భారతాన మారణహోమం జరిపేందుకు కుట్ర పన్నాడు. మృతుడి నివాసంలో జరిపిన దాడుల్లో పెద్ద ఎత్తున పేలుడు పదార్థాలు బయటపడటంతో తీవ్రవాది పన్నిన కుట్ర బట్టబయలైంది. సీసీటీవీ ఫుటేజీ సాయంతో ముబీన్‌కు సహకరించిన ఐదుగురు వ్యక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. అక్టోబర్ 23న జరిగిన కారు పేలుడులో ఉక్కడమ్కు చెందిన జెమిషా ముబీన్ అనే తీవ్రవాది మరణించాడు.
జెమిషా ముబీన్ కారు బాంబు పేలుడు అనంతరం విచారణకు దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ).. ఆయన చేయాలనుకున్న కుట్రలను బయటపెట్టింది. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో భారీగా పేలుడు పదార్థాలను పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పట్టిన ఎన్ఐఏ.. ముబీన్‌ను సహకారం అందించిన ఐదుగురు వ్యక్తులను గుర్తించి యూఏపీఏ కింద 15 రోజుల పోలీసు కస్టడీకి పంపారు. అరెస్టయిన వారు మహ్మద్ తాల్కా, మహ్మద్ అస్రుద్దీన్, మహ్మద్ రియాజ్, ఫిరోజ్ ఇస్మాయిల్, మహ్మద్ నవాజ్.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన ఎన్ఐఏ.. ఐఎస్‌తో సంబంధమున్న రియాజ్, ఫిరోజ్, నవాజ్‌లు ముబీన్ కారులో రెండు సిలిండర్లు, మూడు డ్రమ్ములను ఉంచడం గుర్తించింది. శనివారం రాత్రి 11.30 గంటల ప్రాంతంలో కారులో పేలుడు పదార్థాలు ఉంచారు. నాలుగో నిందితుడు మహ్మద్ తాల్కా ఆ కారును ముబీన్‌తో పాటు అతడి బంధువుల్లో ఒకరికి ఇచ్చాడు. వీరంతా కోయంబత్తూరులోని ఉక్కడం సమీపంలోని జీఎం నగర్ నివాసితులుగా ఎన్ఐఏ గుర్తించింది.
పేలుడు అనంతరం జరిపిన సోదాల్లో ముబీన్ ఇంటి నుంచి 75 కిలోల పొటాషియం నైట్రేట్, బొగ్గు, అల్యూమినియం పౌడర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కోయంబత్తూరు పోలీస్ కమిషనరేట్, కలెక్టరేట్, విక్టోరియా హాల్, కోయంబత్తూరు రైల్వేస్టేషన్, రేస్ కోర్స్ పేర్లు రాసి ఉన్న ప్లాన్ పేపర్‌ను కూడా స్వాధీనపర్చుకున్నారు. వీటి ఆధారంగా కోయంబత్తూరులోని ఐదు ప్రాంతాల్లో పేళుళ్లకు ముబీన్ కుట్రపన్నినట్లుగా ఎన్ఐఏ భావిస్తున్నది..