వరంగల్ టైమ్స్ : గుంటూరు జిల్లా : అమరావతిని రెవిన్యూ డివిజన్‌గా ప్రకటించి రాజధాని కేంద్రం గా కొనసాగిస్తూ కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలని అఖిల భారత పంచాయతీ పరిషత్(ఢిల్లీ) జాతీయ కార్యదర్శి డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు శుక్రవారం ఆయన వెలగపూడి లో రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక శాఖ కార్యదర్శి విజయ్ కుమార్ కార్యాలయంలో విజ్ఞప్తి చేశారు. నగరం బౌద్ధ చారిత్రక ప్రాంతం, ఒకనాడు బౌద్ధం విరాజిల్లిన అమరావతిలో చారిత్రక నిర్మాణాలకు ఇప్పటికీ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. ఎంతో బౌద్ధ చారిత్రక ప్రాశస్థ్యం కలిగిన నగరంపై కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా గుర్తించిందని ఈ సందర్భంగా జాస్తి వీరాంజనేయులు అన్నారు.
అశోక్ చక్రవర్తి, శాతవాహనులు, జైనులు పరిపాలించారు. ఇక్కడ ఉన్న శిల్ప సంపదకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాలు ఏర్పాటు చేయటం శుభపరిణామం అని స్వాగతించదగిన విషయమన్నారు. ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లాను మూడు జిల్లాలుగా అనగా గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా, బాపట్ల జిల్లాలుగా ప్రకటించారని వినతి పత్రంలో వీరాంజనేయులు పేర్కొన్నారు. ప్రజల నుండి అభిప్రాయ సేకరణ తీసుకుంటున్న నేపధ్యంలో పార్లమెంట్ నియోజక కేంద్రాలనే కాకుండా కొన్ని మండలాలను లేదా కొన్ని నియోజక వర్గాలను జిల్లాలుగా చేసుకొనే వెసులబాటు ప్రభుత్వానికి ఉందన్నారు.
ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని ప్రత్యేక రెవెన్యూ డివిజన్ చేసి ప్రత్యేక జిల్లాగా పరిగణించాలని ప్రజల ఆకాంక్ష మరియు విజ్ఞప్తి అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, ఇతర మండలాలను గురజాల రెవిన్యూ డివిజన్లో కలిపారు. దీనివల్ల అమరావతి మండల ప్రజలకు, పెదకూరపాడు నియోజకవర్గ ప్రజానికానికి ఇబ్బందులు మరియు అనేక రవాణా సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంటుందన్నారు.
తాడికొండ నియోజక వర్గంలోని తుళ్ళూరు మండల పరిధిలోని గ్రామాలు గుంటూరు రెవిన్యూ డివిజన్లో ఏర్పాటు చేయబడ్డాయన్నారు. మంగళగిరి నియోజకవర్గంలోని అమరావతి రాజధాని ప్రాంత ప్రజలు రెవిన్యూ పనులు నిమిత్తం గుంటూరుకు రావాల్సి ఉందని తెలిపారు. రాజధాని అమరావతి చుట్టుప్రక్కల గ్రామాల్లోని ప్రజలు రెవిన్యూ పనులు నిమిత్తం రకరకాల ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని జాస్తి వీరాంజనేయులు ఈ సందర్భంగా విచారం వ్యక్తం చేశారు.